కుటుంబ ఆస్తుల విక్రయం కానే కాదు

ABN , First Publish Date - 2021-02-08T06:26:39+05:30 IST

బడ్జెట్‌లో ప్రైవేటీకరణకు పెద్దపీట వేయ డం ‘‘కుటుంబ ఆస్తులు విక్రయించడమే’’ అన్న ప్రతిపక్షం ఆరోపణను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చుతూ దాన్ని ‘‘పనీపాటా లేని ఆరోపణ’’గా అభివర్ణించారు...

కుటుంబ ఆస్తుల విక్రయం కానే కాదు

  • సీపీఎస్‌ఈలను పటిష్ఠం చేయడమే లక్ష్యం  
  • పెట్టుబడుల ఉపసంహరణపై నిర్మల

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రైవేటీకరణకు పెద్దపీట వేయ డం ‘‘కుటుంబ ఆస్తులు విక్రయించడమే’’ అన్న ప్రతిపక్షం ఆరోపణను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చుతూ దాన్ని ‘‘పనీపాటా లేని ఆరోపణ’’గా అభివర్ణించారు. గత ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో పెట్టుబడులు ఉపసంహరించినవేనని, మోదీ ప్రభుత్వం దానికి స్పష్టమైన విధానాన్ని రచించి ఏవి వ్యూహాత్మకం, ఏవి వ్యూహాత్మకం కాదని వర్గీకరించిందని తెలిపారు. వ్యూహాత్మకమైనవిగా వర్గీకరించిన రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 


ఆదివారం ఆమె వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీలో పెట్టుబడు ఉపసంహరణ ప్రణాళిక ప్రతిపక్ష ప్రభుత్వాల కాలంలో రూపొందించినదేనని తెలిపారు. ప్రతిపక్షానికి దీటైన జవాబు చెబుతూ కుటుంబ ఆస్తిని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నదని, చాలా పీఎ్‌సయూలు చిన్నచిన్నవిగా ఉండడం వల్ల వాటి మనుగడ కష్టంగా ఉన్నదని, పని చేస్తున్న కొన్నీ కూడా అందరినీ ఆకర్షించలేకపోతున్నాయని ఆమె అన్నారు. అవసరమైన వాటి పరిధిని మరింతగా పెంచి ఆకాంక్షాపూరిత భారత్‌ ఆశలను తీర్చే విధంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు. గత ప్రభుత్వాల హయాం లో సంస్కరణలు చేపట్టినా ‘‘సోషలిస్టు భారం’’ వ్యాపారాలను మరుగున పడేసిందని, ప్రభుత్వ రంగ కంపెనీల్లో వృత్తి నైపుణ్యాలు లోపించాయని ఆమె చెప్పారు. తక్కువ సంఖ్యలోనే ప్రభుత్వ రంగ కంపెనీలను కుదించి భారత్‌ ఆకాంక్షలను తీర్చగలిగే స్థాయి లో వాటిని తీర్చి దిద్దాలన్నది తమ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. అలాగే పలు సంవత్సరాలుగా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అసమర్థ సీపీఎ్‌సఈల మూలధన కల్పనకు ఉపయోగించారని, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం తమ లక్ష్యమని నిర్మల ఖండితంగా చెప్పారు. భారత భవిష్యత్‌ ఆకాంక్షలు తీరాలంటే ఎస్‌బీఐ వంటి పరిమాణం గల కనీసం 20 సంస్థలు అవసరమని ఆమె అన్నారు. 

ఆర్థిక వ్యవస్థలో స్థూల రికవరీ, టెక్నాలజీ సహాయంతో లీకేజిలను కట్టడి చేయడం వల్ల మూడు నెలలుగా జీఎ్‌సటీ ఆదాయాలు అద్భుతంగా పెరిగాయని నిర్మల చెప్పారు. ఈ ప్రక్రియ ‘‘పన్నుల ఉగ్రవాదం’’ అనే ఆరోపణలు తోసిపుచ్చుతూ అంతకన్నా దాన్ని ‘‘టెక్నాలజీ ఉగ్రవాదం’’ అనవచ్చని ఆమె అన్నారు. 


ప్రధాన పోర్టులు, ఏఏఐకి మినహాయింపు

వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన పీఎ్‌సఈ జాబితా నుంచి ప్రధాన పోర్ట్‌ ట్రస్టులు, ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), సెక్యూరిటీ ప్రింటింగ్‌, ముద్రణాలయాలకు మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, వెనుకబడిన తరగతులు, సఫాయీ కర్మచారీల వంటి వర్గాల కోసం  ఏర్పాటైన సంస్థలు, దివ్యాంగులకు అవసరమైన సామాగ్రి తయారుచేసే కంపెనీలు, రైతులకు విత్తనాలు అందించే సంస్థలు, ప్రభుత్వ సరఫరాకు అవసరమైన ఆహార ధాన్యాలు సేకరించి పంపిణీ చేసే సంస్థలకు కూడా ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇస్తారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం రూపొందించిన కొత్త పీఎ్‌సఈ విధానంలో ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మకమైనవి, వ్యూహాత్మకం కానివిగా వర్గీకరించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మాత్రమే అది పరిమితం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పెట్టుబడుల ఉపసంహరణ/వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ఆవిష్కరిస్తూ నాలుగు రంగాలకే అది పరిమితమని, అందులో సీపీఎ్‌సఈల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పారు. 

వ్యూహాత్మకం కానివిగా వర్గీకరించిన నాలుగు రంగాల్లో అణువిద్యుత్‌, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలీకమ్యూనికేషన్లు; విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు;  బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సర్వీసులు ఉన్నాయి. ఈ రంగాల్లోని సీపీఎ్‌సఈలను ప్రైవేటీకరించడం లేదా మూసివేతకు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. 

కాగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగంలో సభ్యులైన ఆర్థిక మంత్రి, రోడ్డు రవాణా మంత్రి, పాలనా మంత్రిత్వ శాఖల మంత్రులు ఏయే సీపీఎ్‌సఈలను ప్రభుత్వ రంగంలో ఉంచుకోవాలనే జాబితాకు ఆమోద ముద్ర వేస్తారు.


Updated Date - 2021-02-08T06:26:39+05:30 IST