బ్రిటన్‌లో ‘సీరమ్’ ప్లాంట్
ABN , First Publish Date - 2021-05-05T06:44:47+05:30 IST
వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తన ఉత్పత్తి కార్యకలాపాలను బ్రిటన్‌కు విస్తరిస్తోంది...

- రూ.2,450 కోట్ల పెట్టుబడి
లండన్: వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తన ఉత్పత్తి కార్యకలాపాలను బ్రిటన్‌కు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశంలో 24 కోట్ల పౌండ్లు (సుమారు రూ.2,450 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాన మంత్రి కార్యాలయం డౌనింగ్ స్ర్టీట్ ఈ విషయం ప్రకటించింది. ఇందులో భాగంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ బ్రిటన్‌లో వ్యాక్సిన్ల తయారీ యూనిట్, ఆర్ అండ్ యూనిట్, క్లినికల్ పరీక్షల కేంద్రాలతో పాటు సేల్స్ ఆఫీస్ ఏర్పాటు చేస్తుంది. పుణె కేంద్రంగా పనిచేసే సీరమ్.. ప్రస్తుతం భారత్ వెలుపల ఎక్కడా వ్యాక్సిన్ల తయారీ యూనిట్లు లేవు. త్వరలో భారత్ వెలుపల కూడా వ్యాక్సిన్ల తయారీ చేపట్టే విషయం పరిశీలిస్తున్నట్టు కంపెనీ చైర్మన్ అధర్ పూనావాలా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో డౌనింగ్ స్ట్రీట్ ఈ ప్రకటన చేయడం విశేషం. సీరమ్ ఇప్పటికే యూకేలో ముక్కు ద్వారా తీసుకునే సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు జరుపుతోంది.
మేము సైతం: ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో కంపెనీలూ యూకేలో కొత్త పెట్టుబడులు ప్రకటించాయి. విప్రో రూ.163 కోట్ల పెట్టుబడులు పెడుతుండగాఇన్ఫోసిస్, ఎంఫసిస్ బ్రిటన్‌లోని ఐటీ యూనిట్లను విస్తరించనున్నట్టు ప్రకటించాయి. విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో 2000 మంది స్థానికుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి.