భల్లూక బీభత్సం
ABN , First Publish Date - 2021-10-29T08:51:18+05:30 IST
మదుపర్ల అమ్మకాల హోరులో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,158.63 పాయింట్లు (1.89 శాతం) పతనమై 59,984.70 వద్దకు జారుకుంది.

సెన్సెక్స్ 1,159 పాయింట్లు పతనం
60,000 దిగువ స్థాయికి సూచీ
18,000 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ
ఏప్రిల్ 12 తర్వాత అతిపెద్ద క్షీణత
రూ.4.82 లక్షల కోట్ల సంపద ఫట్
ముంబై: మదుపర్ల అమ్మకాల హోరులో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,158.63 పాయింట్లు (1.89 శాతం) పతనమై 59,984.70 వద్దకు జారుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న 1,708 పాయింట్లు కోల్పోయిన సూచీకి ఆ తర్వాత అతిపెద్ద నష్టమిది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 353.70 పాయింట్లు (1.94 శాతం) క్షీణించి 17,857.25 వద్దకు పడిపోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ అంచనాల కంటే తక్కువ లాభాలు ప్రకటించిన ఐటీసీ షేరు అత్యధికంగా 5.54 శాతం క్షీణించింది. కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 4 శాతానికి పైగా నష్టపోగా.. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3 శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ మాత్రం 2.94 శాతం లాభంతో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. బ్లూచిప్ కంపెనీలతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. భల్లూక బీభత్సకాండలో రూ.4.82 లక్షల కోట్ల మార్కెట్ సంపద హరించుకుపోయింది. దాంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ సంపద రూ.260.48 లక్షల కోట్లకు పడిపోయింది.