వాహన వేగానికి వైరస్‌ బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-02T06:53:43+05:30 IST

కార్ల కంపెనీలపై కరోనా రెండో దశ ఉధృతి గట్టి ప్రభావం చూపుతోంది. వాహన విక్రయాల జోరుకు వైరస్‌ మళ్లీ అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మెజారిటీ కంపెనీల అమ్మకాలు తగ్గాయి...

వాహన వేగానికి వైరస్‌ బ్రేక్‌

  • స్థానిక లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ఏప్రిల్‌లో తగ్గిన కార్ల విక్రయాలు  

న్యూఢిల్లీ: కార్ల కంపెనీలపై కరోనా రెండో దశ ఉధృతి గట్టి ప్రభావం చూపుతోంది. వాహన విక్రయాల జోరుకు వైరస్‌ మళ్లీ అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మెజారిటీ కంపెనీల అమ్మకాలు తగ్గాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు స్థానిక లాక్‌డౌన్‌లు విధించాయి. మిగతా రాష్ట్రాల్లోనూ రాత్రి కర్ఫ్యూ, తదితర ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో వాహన మార్కెట్లో లావాదేవీలు తగ్గడంతోపాటు సరఫరా అవాంతరా లు అమ్మకాలకు గండికొడుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో  ఆయా ఆటోమొబైల్‌ సంస్థల అమ్మకాల వివరాలు.. 


  1. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు ఏప్రిల్‌లో 4 శాతం తగ్గి 1,59,691 యూనిట్లకు పడిపోయాయి. మార్చి లో 1,67,014 కార్లను విక్రయించిందీ కంపెనీ. కరోనా కేసుల పెరుగుదలతో వాహన సరఫరాకు భంగం కలగడం ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్‌లో కఠిన లాక్‌డౌన్‌ కారణంగా మారుతి ఒక్క కారు కూడా విక్రయించలేకపోయింది.  
  2. రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుండయ్‌ మోటార్‌ విక్రయాలు కూడా తగ్గాయి. మార్చిలో విక్రయించిన 64,621 యూనిట్లతో పోలిస్తే, ఏప్రిల్‌ సేల్స్‌ 8 శాతం తగ్గి 59,203 యూనిట్లకు పరిమితం అయ్యాయి. 
  3. గత నెలకు దేశీయంగా టాటా మోటార్స్‌ మొత్తం విక్రయాలు 41 శాతం తగ్గి 39,530 యూనిట్లకు పడిపోయాయి. మార్చిలో 66,609 యూనిట్ల అమ్మకాలు జరిపింది. 
  4. మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) మొత్తం వాహన విక్రయాలు ఏప్రిల్‌లో 10 శాతం తగ్గి 36,437 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మార్చి అమ్మకాలు 40,403 యూనిట్లుగా ఉన్నాయి. 
  5. ఏప్రిల్‌లో కియా ఇండియా టోకు విక్రయాలు 16 శాతం తగ్గి 16,111 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చిలో 19,100 కార్లు అమ్మగలిగింది. 
  6. హోండా కార్స్‌  ఇండియా సేల్స్‌ మాత్రం 28 శాతం వృద్ధితో 9,072 యూనిట్లకు పెరిగాయి. మార్చిలో కంపెనీ అమ్మకాలు 7,103 యూనిట్లుగా నమోదయ్యాయి. 
  7. గత నెలలో టయోటా కిర్లోస్కర్‌ 9,622 కార్లు విక్రయించగా.. ఎంజీ మోటార్‌ రిటైల్‌ సేల్స్‌ 2,565 యూనిట్లుగా ఉన్నాయి. 


టూవీలర్‌ కంపెనీలకూ నిరాశే.. 

  1. గత నెలలో హీరో మోటోకార్ప్‌ అమ్మకాలు ఏకంగా 35 శాతం తగ్గి 3,72,285 యూనిట్లకు పడిపోయాయి. మార్చిలో 5,76,957 టూ వీలర్లను విక్రయించింది. 
  2. ఏప్రిల్‌లో 53,298 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు అమ్ముడుపోయాయి. మార్చిలో నమోదైన 66,058 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 19 శాతం తగ్గాయి. 



Updated Date - 2021-05-02T06:53:43+05:30 IST