ప్రభుత్వ బాండ్లలోకి రిటైల్ పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-02-06T06:25:12+05:30 IST
అందరూ ఊహించినట్టుగానే ఆర్‌బీఐ ఈ సారి కూడా కీలక రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. అయితే ఆర్ధిక

ఆర్‌బీఐ పాలసీలో కీలక నిర్ణయాలు
ఈ వెసులుబాటు కల్పించిన తొలి ఆసియా దేశం భారత్
రెపో రేట్లు యథాతథం, మార్చి నుంచి వడ్డీ రేట్ల పెరుగుదల?
ముంబై : అందరూ ఊహించినట్టుగానే ఆర్‌బీఐ ఈ సారి కూడా కీలక రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. అయితే ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం కోసం మరికొంత కాలం పాటు వడ్డీ రేట్ల విషయంలో సరళ వైఖరి కొనసాగిస్తూ అవసరమైనంత లిక్విడిటీ అందించనున్నట్టు తెలిపింది. అంతేకాదు ప్రభుత్వ సెక్యూరిటీ (జీ-సెక్)ల్లో పెట్టుబడికి రిటైల్ ఇన్వెస్టర్లకు చరిత్రలో తొలిసారిగా ద్వారాలు తెరిచింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ సారథ్యంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం అనంతరం రాబోయే రెండు నెలల కాలానికి అనుసరించనున్న విధానాన్ని ప్రకటించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యులూ ఏకాభిప్రాయం ప్రకటించినట్టు దాస్ చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రెపో రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి. దీంతో రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద చారిత్రక కనిష్ఠ స్థాయిల్లో యథాతథంగా ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఆర్‌బీఐ 1.15 శాతం మేరకు తగ్గించింది.
జీ-సెక్ మార్కెట్లో పెద్ద సంస్కరణ
ప్రభుత్వ బాండ్ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రవేశం కల్పించడం జీ-సెక్ మార్కెట్లో తొలి పెద్ద సంస్కరణ. దీంతో ప్రభుత్వ రుణ మార్కెట్లోకి రిటైల్ ఇన్వె్‌స్టమెంట్లను అనుమతించిన తొలి ఆసియా దేశం భారత్ అవుతుంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రిటైల్ పెట్టుబడులను పరోక్షంగా అనుమతిస్తున్నారు. మన దేశంలో బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో గోబిడ్ వేదిక ద్వారా రిటైల్ ఇన్వె్‌స్టమెంట్లకు అవకాశం ఉన్నప్పటికీ దానికి అంత గా ఆదరణ లభించలేదు.
తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో అతి పెద్ద సంస్కరణ. కరోనా కారణంగా కుదేలైపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి వచ్చే ఏడాది రూ.12 లక్షల కోట్ల మేరకు రుణ సమీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం, అందుకు అవసరమైన నిధు లు తక్కువ వ్యయంతో రిటైల్ డిపాజిటర్ల నుంచి సమీకరించడం ఈ నిర్ణయం లక్ష్యాలు.
ఒక దేశం, ఒకే అంబుడ్స్‌మన్
కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ ఏడాది జూన్ నుంచి ‘‘ఒక జాతి, ఒకే అంబుడ్స్‌మన్’’ విధానం అవలంబించనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, డిజిటల్ లావాదేవీలపై కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి మూడు వేర్వేరు విభాగాలు పని చేస్తున్నాయి. కొత్త పథకం కింద ఆ మూడింటినీ ఒకే ఛత్రం పరిధిలోకి తెస్తారు.
ఎన్‌పీఏలపై దృఢ వైఖరి
బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) మదింపు, పర్యవేక్షణ చేపట్టనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఎన్‌పీఏలపై స్పష్టత కోసం ఆర్‌బీఐ ఇప్పటికే స్వతంత్ర మదింపు చేస్తోంది.
టీఎల్‌టీఆర్‌ఓ కింద ఎన్‌బీఎ్‌ఫసీలకు నిధులు
బ్యాంకుల నుంచి టీఎల్‌టీఆర్‌ఓ పథకం కింద ఎన్‌బీఎ్‌ఫసీలకు నిధులు అందించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. బ్యాంకు లు నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు గత అక్టోబరులో ఆర్‌బీఐ ఆన్ టాప్ టీఎల్‌టీఆర్‌ఓ పథకం ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్‌తో అనుసంధానమైన రెపో రేటు కింద బ్యాంకులు రూ.1 లక్ష కోట్లు నిధులు మూడేళ్ల కాలపరిమితి లోపు విభిన్న కాలపరిమితులకు పొందవచ్చు.
వృద్ధిరేటు 10.5 శాతం
2021-22లో వృద్ధి రేటు అంచనాను 10.5 శాతంగా ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం కన్నా ఇది తక్కువ.
ఏం చేయాలి?
జీ-సెక్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి గల రిటైల్ ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ వద్ద ‘‘రిటైల్ డైరెక్ట్’’ పేరిట గిల్ట్ సెక్యూరిటీల ఖాతా ప్రారంభించాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వేరుగా జారీ చేస్తారు.
డిజిటల్ కరెన్సీపై త్వరలో నిర్ణయం
క్రిప్టో కరెన్సీల తరహాలో సొంతంగా ఒక డిజిటల్ కరెన్సీ ప్రారంభించే అవకాశాలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కనుంగో తెలిపారు. దీనిపై ఇప్పటికే ఆర్‌బీఐ అంతర్గత కమిటీ ఒకటి అధ్యయనం చేస్తోంది.
రుణాలపై వడ్డీ పోటు
మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడగానే దశలవారీగా సీఆర్‌ఆర్‌ను (బ్యాంకులు సేకరించే డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సిన మొత్తం) తిరిగి 4 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తు తం సీఆర్‌ఆర్ 3 శాతం ఉంది.
కరోనా కారణంగా దెబ్బతిన్న బ్యాంకులు సంక్షోభం నుంచి బయటపడేందుకు మద్దతుగా గత మార్చిలో సీఆర్‌ఆర్‌ను 1 శాతం తగ్గించి మూడు శాతం చేశారు. ఆ వెసులుబాటు ఏడాది పాటు కల్పించినందు వల్ల వచ్చే నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికం నుంచి సీఆర్‌ఆర్‌ను తిరిగి 4 శాతానికి పెంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దీని వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.1.37 లక్షల కోట్ల నిధులు ఆర్‌బీఐ ఖజానాకు తరలిపోతాయి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడి రిటైల్ రుణ గ్రహీతలపై భారం పడుతుంది.