‘ఆర్‌బీఎల్‌’ డిపాజిట్లకు ఢోకా లేదు: ఆర్‌బీఐ

ABN , First Publish Date - 2021-12-28T06:02:08+05:30 IST

ప్రైవేటు రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితిపై భయపడాల్సిందేమీ లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. మూలధనం, స్వల్పకాలిక చెల్లింపులకు అవసరమైన....

‘ఆర్‌బీఎల్‌’ డిపాజిట్లకు ఢోకా లేదు: ఆర్‌బీఐ

ముంబై: ప్రైవేటు రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితిపై భయపడాల్సిందేమీ లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. మూలధనం, స్వల్పకాలిక చెల్లింపులకు అవసరమైన నిధులపరంగా చూసినా బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. డిపాజిటర్లు, ఇతర భాగస్వాములకు ప్రయోజనాలకూ ఎలాంటి ఢోకా లేదని తెలిపింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ విశ్వవీర్‌ అహూజా సెలవుపై వెళ్లడం, ఆ స్థానంలో రాజీవ్‌ అహూజాను నియమించడంతో బ్యాంకులో ఏదో జరుగుతోందనే వార్త లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం. 


ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చెల్లింపులకు 100 శాతం నిధులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం బ్యాంక్‌ వద్ద 154 శాతం నిధులు ఉన్న విషయాన్ని ఆర్‌బీఐ గుర్తు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి బ్యాంకు మూలధన నిష్పత్తి 16.33 శాతంగా ఉన్నట్టు తెలిపింది.


ఝున్‌ఝున్‌వాలా, దమానీ ఆసక్తి: మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఈక్విటీలో 10 శాతం కొనుగోలు చేసేందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆర్‌కే దమానీ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇందు కు అనుమతించాలని వీరు ఆర్‌బీఐకి దరఖాస్తు చేసినట్టు సీఎన్‌బీసీ టీవీ 18 చానల్‌ కథనం. అయితే దీనిపై ఝున్‌ఝున్‌వాలాగానీ, దమానీగానీ అధికారికంగా స్పందించలేదు. 


షేరు ఢమాల్‌: బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలతో ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేరు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో ఒక దశలో 23.27 శాతం నష్టపోయాయి. చివరికి కొద్దిగా కోలుకుని 18.32 శాతం నష్టంతో రూ.140.90 వద్ద ముగిసింది.

Updated Date - 2021-12-28T06:02:08+05:30 IST