పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్,,, రేసులో అదాని, ఎల్ అండ్ టీ...

ABN , First Publish Date - 2021-08-27T21:11:52+05:30 IST

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ ఇక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.

పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్,,, రేసులో అదాని, ఎల్ అండ్ టీ...

బెంగళూరు: పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ ఇక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)నే నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తొలి నుంచి... ఇస్రో సొంతంగా ఈ తయారీ ప్రక్రియలో ఉంది. కాగా... తాజాగా... ఆ ప్రక్రియ... ఇస్రోతోపాటు ప్రైవేటుపరమయ్యే క్రమంలో గ్రీన్ సిగ్నల్ పడింది. ఇందులో భాగంగా పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానున్నాయి. పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్‌ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్‌ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎల్ అండ్ టీ సారధ్యంలోని కన్సార్టియంలు రేసులో ఉన్నాయి. ఈ రెండు కన్సార్టియాలతో పాటు మరోవైపు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్) సింగిల్ కంపెనీగా బిడ్స్‌ను దాఖలు చేసింది. అయితే దీని సారధ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడివే ఓ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. 


ఇక ఎల్ అండ్ టీ సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉండడం గమనార్హం. ఈ రండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్‌ను దాఖలు చేసింది. ఈ బిడ్లన్నీ కూడా టెక్నో-కమర్షియల్ ఎవాల్యూషన కింద ఉన్నాయని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పర్యవేక్షణలో కార్యకలాపాలను సాగిస్తోన్న కంపెనీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. కిందటి నెల 30 వరకు అదాని గ్రూప్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్‌ నుంచి ‘ఆసక్తి వ్యక్తీకరణ’ బిడ్స్ దాఖలయ్యాయి. ఎవాల్యూషన్ పూర్తైన తరువాత...  అర్హత సాధించిన కన్సార్షియాన్ని ఎంపిక చేసి, పీఎస్ఎల్‌వీ తయారీ కాంట్రాక్ట్ పనులను అప్పగిస్తామని చెప్పారు. కాగా... ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీఎస్‌ఎల్వీ తయారీ ప్రక్రియ మొత్తం ఎండ్-టు-ఎండ్... ప్రైవేటుపరం కాబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


తొలిదశ దాదాపుగా పూర్తయినట్టే...

మొత్తంమీద బడా పారిశ్రామికవేత్త అదాని ఇక అంతరిక్ష పరిశోధనల రంగంలోకి అడుగుపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ విధానం పరిధిలోకి ఇస్రోను కూడా చేర్చడానికి తాజా పరిస్థితిని తొలి అడుగుగా భావిస్తున్నారు. కాగా... ఇదే క్రమంలో... ఇస్రో సైతం ప్రైవేటీకరణ దిశగా సాగుతోందన్న ఆందోళన కూడా ఉన్నట్లు వినవస్తోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను ఆహ్వానించడంతో తొలిదశలో కీలకమైన పీఎస్ఎల్‌వీ  ప్రైవేటీకరణ పూర్తయినట్లేనన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 

Updated Date - 2021-08-27T21:11:52+05:30 IST