హెల్త్‌కేర్‌లో విస్తృత భాగస్వామ్యం కల్పించండి
ABN , First Publish Date - 2021-06-28T08:44:32+05:30 IST
దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో జీవిత బీమా కంపెనీల విస్తృత భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలని హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ కంపెనీ వార్షిక నివేదికలో కోరారు.
న్యూఢిల్లీ: దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో జీవిత బీమా కంపెనీల విస్తృత భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలని హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ కంపెనీ వార్షిక నివేదికలో కోరారు. గత ఏడాది కాలంగా దేశాన్ని కుదిపివేస్తున్న మహమ్మారి ప్రజారోగ్య వ్యవస్థలకు పెనుసవాలు విసిరిందని తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట దశలో ఒక్క రాత్రిలోనే తాము వర్చువల్ వర్కింగ్ మోడల్‌కు మారామని వెల్లడించారు.
కొత్త బిజినెస్ ప్రీమియం అధికంగా సాధించిన రెండు అగ్రశ్రేణి ప్రైవేటు కంపెనీల్లో ఒకటిగా తాము నిరంతరం గుర్తింపు సాధిస్తున్నామని తెలిపారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న స్థితిలో కూడా గత ఏడాది రూ.20,107 కోట్ల కొత్త ప్రీమియం సాధించి 21.5 శాతం మార్కెట్ వాటా పొందినట్టు పేర్కొన్నారు. తాము ఎప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు పెంచుకోవడానికి తగినన్ని పెట్టుబడులు పెడుతూనే ఉంటామని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జీవిత బీమా సంస్థలు మరింత మెరుగైన పాత్ర పోషించేందుకు అనుమతించాలని ఐఆర్‌డీఏఐని కోరారు.