భారత్ బయోటెక్ ‘రోటావ్యాక్ 5డీ’కి ప్రీక్వాలిఫికేషన్
ABN , First Publish Date - 2021-08-03T06:01:03+05:30 IST
భారత్ బయోటెక్‌కు చెందిన రోటావైరస్ వ్యాక్సిన్ ‘రోటావ్యాక్ 5డీ’కి ప్రపంచ

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ బయోటెక్‌కు చెందిన రోటావైరస్ వ్యాక్సిన్ ‘రోటావ్యాక్ 5డీ’కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‘ప్రీక్వాలిఫికేషన్’ గుర్తింపు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రోటా వ్యాక్ 5డీని సరఫరా చేయడానికి ఈ గుర్తింపు దోహదం చేస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ డోస్ (0.5 ఎంఎల్) రోటా వైరస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది. కంపెనీ ఉత్పత్తి చేస్తున్న రోటావ్యాక్‌కు రోటావ్యాక్ 5డీ కొత్త వేరియంట్. పిల్లల్లో కనిపించే రోటా వైరస్ ఇన్ఫెక్షన్‌ను ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది.
ప్రీక్వాలిఫికేషన్ లభించడంతో యునిసెఫ్, పీఏహెచ్‌ఓ వంటి యునైటెడ్ నేషన్స్ (యూఎన్) ఏజెన్సీలు తమ వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తాయి. అంతర్జాతీయ నాణ్యత, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ఉందని ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు నిర్ధారిస్తుందని భారత్ బయోటెక్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. భారత్, విదేశీ భాగస్వాములతో కలిసి దేశీయంగా రోటావ్యాక్, రోటావ్యాక్ 5డీ వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిందని అన్నారు. 30 ఏళ్ల నిర్విరామ కృషికి రోటా వైరస్ వ్యాక్సిన్ నిదర్శనమని చెప్పారు.