ఒమైక్రాన్‌తో వృద్ధికి ముప్పు

ABN , First Publish Date - 2021-12-30T07:52:02+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరందుకున్నాయని ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక పేర్కొంది...

ఒమైక్రాన్‌తో వృద్ధికి ముప్పు

 అధిక ధరలూ సవాలే.. ఆర్థిక స్థిరత్వ నివేదికలో  హెచ్చరించిన ఆర్‌బీఐ 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరందుకున్నాయని ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక పేర్కొంది. అయితే, ఒమైక్రాన్‌తోపాటు అధిక ధరలు వృద్ధి పునరుద్ధరణకు ప్రధాన సవాళ్లుగా మారాయని  హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక  ప్రతికూలతలతోపాటు తాజాగా ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో కరోనా రెండో వ్యాప్తి విధ్వంసం అనంతరం ఆర్థిక వృద్ధి క్రమంగా మెరుగుపడుతూ వచ్చిందని నివేదిక ముందుమాటలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. బలమైన, స్థిరమైన వృద్ధి రికవరీ ప్రైవేట్‌ పెట్టుబడులు, వినియోగం పెరుగుదలపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రెండూ కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి ఇంకా చేరుకోలేదన్నారు. ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనకరమని.. ఆహార, ఇంధన  ధరలను నియంత్రించేందుకు సరఫరా అవాంతరాలకు తొలిగించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 


మళ్లీ 8.1-9.5 శాతానికి మొండిబకాయిలు! 

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు 6.9 శాతానికి తగ్గాయి. అయితే, ఒమైక్రాన్‌ వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపిన పక్షంలో ఈ ఏడాది సెప్టెంబరు చివరినాటికి ఎన్‌పీఏలు మళ్లీ 8.1-9.5 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. అంతేకాదు, బ్యాంకిం గ్‌ రంగంలో రిటైల్‌ రుణాల చెల్లింపుల వైఫల్యాలు పెరగడంపైనా ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభ నేపథ్యంలోనూ దేశీయ ఆర్థిక సేవల వ్యవస్థ పటిష్ఠంగా ఉందని దాస్‌ అన్నారు. ఆర్థిక సేవల మార్కెట్ల స్థిరత్వం కోసం చేపట్టిన విధానపరమైన చర్యలు, మద్దతు ఇందుకు దోహదపడ్డాయన్నారు. 


ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే.. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021-22) కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడంపై ఆర్‌బీఐ సందేహం వ్యక్తం చేసింది.

Updated Date - 2021-12-30T07:52:02+05:30 IST