నిర్మలకే ‘ఆర్థికం’
ABN , First Publish Date - 2021-07-08T06:59:48+05:30 IST
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను కొనసాగించారు. శాఖల కేటాయింపులో ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలు ఆమె వద్దనే ఉంచారు.
ప్రైవేటీకరణపై పట్టుకు డీపీఈ విలీనం
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను కొనసాగించారు. శాఖల కేటాయింపులో ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలు ఆమె వద్దనే ఉంచారు. కరోనా ఒత్తిడుల నేపథ్యంలో 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక శాఖ నిర్వహణ బాధ్యతను ఆమె వద్దనే ఉంచడం ద్వారా మోదీ ఆమెపై నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఆమెకు సహాయమంత్రులుగా పంకజ్ చౌధరి, భగవత్ కిషన్ రావు కరడ్లను నియమించారు. ఆర్థిక శాఖను మరింత విస్తరించడంతో పాటు ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణపై పట్టు బిగించడం లక్ష్యంగా కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే ప్రభుత్వ పరిశ్రమల శాఖను (డీపీఈ) ఆ శాఖలో విలీనం చేశారు. దీంతో సీపీఎస్ఈల ఆస్తుల ద్రవ్యీకరణ, ఆర్థిక స్వస్థత, పెట్టుబడి వ్యయాలను కూడా ఆర్థిక శాఖ సమర్థవంతంగా పర్యవేక్షించగలుగుతుంది.
ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ శాఖలు : ఆర్థిక వ్యవహారాల శాఖ; రెవిన్యూ శాఖ; వ్యయ శాఖ; పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ; ఆర్థిక సర్వీసుల శాఖ; డీపీఈ (కొత్తగా విలీనం అయింది).
డీపీఈ నిర్వహించే బాధ్యతలు : సీపీఎస్ఈల సాధారణ విధానాల పర్యవేక్షణ; ఎంఓయూలు సహా పీఎ్సఈల పనితీరు మదింపు, పర్యవేక్షణ; సీపీఎ్సఈల పెట్టుబడి ప్రాజెక్టులు, వ్యయాల సమీక్ష; సీపీఎస్ఈల సామర్థ్యాల నిర్మాణం; మూసివేత, పునరుజ్జీవం వంటి అంశాలపై సలహాలు; ఉద్యోగుల కౌన్సెలింగ్, శిక్షణ, పునరావాసం; ‘రత్న’ హోదా సహా సీపీఎస్ఈల వర్గీకరణ.
ప్రభుత్వ ప్రైవేటీకరణ అజెండా: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ లక్ష్యంగా భారీ ప్రైవేటీకరణను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దాని ప్రకారం ఎల్ఐసీ మెగా ఇష్యూతో పాటు ఐడీబీఐ బ్యాంకులో మిగతా ప్రభుత్వ వాటాల విక్రయం, భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్, పవన్ హాన్స్, ఎయిరిండియాల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం అజెండాలో ప్రధానాంశాలు. గత సెప్టెంబరులో ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలోని 34 పీఎ్సయూల్లో ఎనిమిదింటిలో వాటాల విక్రయం పూర్తయింది. మరో నాలుగు పీఎ్సయూల వాటాల విక్రయం నిలిపివేసి వాటి మూసివేతకు సిఫారసు చేశారు.