నాగార్జున ఫెర్టిలైజర్స్‌కు ఊరట

ABN , First Publish Date - 2021-05-14T05:40:51+05:30 IST

రుణ వసూళ్ల వ్యవహారంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో పాటు డైరెక్టర్లు, షేర్‌హోల్డర్స్‌, గ్యారెంటీదారులపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకోరాదని....

నాగార్జున ఫెర్టిలైజర్స్‌కు ఊరట

కఠిన చర్యలు వద్దని బ్యాంకులకు హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రుణ వసూళ్ల వ్యవహారంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో పాటు డైరెక్టర్లు, షేర్‌హోల్డర్స్‌, గ్యారెంటీదారులపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకోరాదని బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది. రూ.1,675 కోట్ల రుణ బకాయిల పరిష్కారానికి ఆమోదం తెలిపిన రుణదాతల కమిటీ ఆ తర్వాత కాదని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా ప్రక్రియ చేపట్టడాన్ని సింగిల్‌ జడ్జి సమర్థించారు. ఈ చర్యలను సవాల్‌ చేస్తూ నాగార్జున ఫెర్టిలైజర్స్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీదేవి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. తామిచ్చిన రుణ పరిష్కార ప్రతిపాదనను ఉమ్మడి రుణదాతల కమిటీ 2020 మార్చిలో ఆమోదించిందని, ఆ తర్వాత దానికి విరుద్థంగా ఎన్‌సీఎల్‌టీలో దివాలా పరిష్కార చర్యలు చేపట్టిందని కంపెనీ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌ రెడ్డి వాదించారు. దీంతో హైకోర్టు ప్రతివాదులైన పలు బ్యాంకులకు, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది. ఈలోగా కఠిన చర్యలు తీసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది.

Updated Date - 2021-05-14T05:40:51+05:30 IST