ఎన్‌ఏసీఎల్ సామర్థ్య విస్తరణ
ABN , First Publish Date - 2021-03-21T06:25:08+05:30 IST
హైదరాబాద్‌కు చెందిన అగ్రికెమికల్ కంపెనీ ఎన్‌ఏసీఎల్ శ్రీకాకుళంలోని ప్లాంట్ వార్షిక సామర్థ్యాన్ని 10 వేల మెట్రిక్ టన్నుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నులకు పెంచనుంది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన అగ్రికెమికల్ కంపెనీ ఎన్‌ఏసీఎల్ శ్రీకాకుళంలోని ప్లాంట్ వార్షిక సామర్థ్యాన్ని 10 వేల మెట్రిక్ టన్నుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నులకు పెంచనుంది. ఎన్‌ఏసీఎల్ అనుబంధ సంస్థ ఎన్‌ఏసీఎల్ స్పెక్-కెమ్ లిమిటెడ్ అగ్రికెమికల్స్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్లు, ఫార్ములేషన్ల తయారీకి కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దశల వారీగా దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 25 వేల మెట్రిక్ టన్నులకు పెంచనుంది. మరో అనుబంధ కంపెనీ ఎన్‌ఏసీఎల్ మల్టీకెమ్ అగ్రికెమికల్స్, సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్లాంట్ సామర్థ్యం 38 వేల మెట్రిక్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. అగ్రికెమికల్స్ మార్కెట్ దేశంలో ఏడాదికి 8 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని 2021-22 ఆర్థిక సంవత్సరానికి 370 కోట్ల డాలర్లకు చేరగలదని అంచ నా వేస్తున్న నేపథ్యంలో గిరాకీకి అనుగుణంగా సామర్థ్యాలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఎన్‌సీఏఎల్ పేర్కొంది.
కొత్త ప్రాంతాలకు..: వ్యాపార కార్యకలాపాలను కొత్త ప్రాంతాలకు విస్తరించాలని ఎన్‌ఏసీఎల్ భావిస్తోంది. అంతే గాక, అంతర్జాతీయ సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడంపైనా ఆసక్తి చూపుతోంది. రైతులకు అత్యంత అవసరమైన ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన, తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌సెక్టిసైడ్స్, ఫంగీసైడ్స్, హెర్బిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ల విభాగాల్లో టెక్నికల్, ఫార్ములేషన్ ఉత్పత్తులను ఎన్‌ఏసీఎల్ విక్రయిస్తోంది.