వారం రోజుల్లో మార్కెట్లోకి మోల్నుపిరవిర్
ABN , First Publish Date - 2021-12-30T07:50:49+05:30 IST
మోల్నుపిరవిర్ ఔషధం తయారు చేయడానికి దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. వారం రోజుల్లో అధిక శాతం కంపెనీలు మార్కెట్‌లోకి వివిధ బ్రాండ్లతో మోల్నుపిరవిర్‌ను ప్రవేశపెట్టనున్నాయి...

విడుదలకు కంపెనీలు సన్నద్ధం
ఒక్కో క్యాప్సూల్ ధర రూ.40-70!
తక్కువ ధరకే కొవిడ్ చికిత్స అందుబాటులోకి
గరిష్ఠంగా అయ్యే వ్యయం రూ.2,800
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మోల్నుపిరవిర్ ఔషధం తయారు చేయడానికి దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. వారం రోజుల్లో అధిక శాతం కంపెనీలు మార్కెట్‌లోకి వివిధ బ్రాండ్లతో మోల్నుపిరవిర్‌ను ప్రవేశపెట్టనున్నాయి. ఆయా బ్రాండ్‌ను బట్టి ఒక్కో 200 ఎంజీ క్యాప్సూల్ ధర రూ.40-70 వరకూ ఉంటుంది. రోజుకు రెండు పూటలా, పూటకు 4 చొప్పున తీసుకుంటే అయిదు రోజుల్లో 40 క్యాప్సూల్స్‌కు గరిష్ఠంగా అయ్యే వ్యయం రూ.2,800! దేశీయంగా మొత్తం 13 కంపెనీలు మోల్నుపిరవిర్‌ను తయారు చేసి దేశ, విదేశాలకు సరఫరా చేయనున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారికి తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడానికి దీనితో మార్గం సుగమం కానుంది. మోల్నుపిరవిర్‌కు నియంత్రిత అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వడం కొవిడ్ చికిత్సలో మేలి మలుపని ఔషధ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌కు నోటి ద్వారా తీసుకునే తొలి ఔషధం ఇదే. రోగి చనిపోయే రిస్క్‌ను మోల్నుపిరవిర్ తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది అద్భుత ఔషధం కాకపోయినప్పటికీ కరోనా చికిత్సపై కొత్త ఆశలు రేపుతోందని, రిస్క్‌ను బాగా తగ్గించగలదంటున్నారు. స్వల్పం నుంచి ఒక మాదిరి కోవిడ్‌తో బాధపడుతున్న రోగులకు ఇక ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని, చికిత్స సౌకర్యవంతం కాగలదని భావిస్తున్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో కన్సార్షియం..
డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, ఎంక్యూర్, టోరెంట్ ఫార్మా, వైట్రిస్ (గతంలో మైలాన్) కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో కన్సార్షియంగా ఏర్పడి అయిదు నెలల పాటు ఉమ్మడిగా మోల్నుపిరవిర్ భద్రత, సమర్థతపై పరీక్షలు నిర్వహించాయి. ఈ కంపెనీలు మెర్క్ షార్ప్ డోమ్‌తో (ఎంఎ్‌సడీ) నాన్ ఎక్స్‌క్లూజివ్ వాలెంటరీ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు 100 తక్కువ, మఽధ్య స్థాయి ఆదాయ దేశాలకు మోల్నుపిరవిర్‌ను సరఫరా చేయనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, ఆప్టిమస్, నాట్కో తదితర హైదరాబాద్ కంపెనీలు మోల్నుపిరవిర్‌ను తయారు చేయనున్నాయి. లారస్ ల్యాబ్స్, దివీస్ లేబొరేటరీస్ మోల్నుపిరావిర్ ఏపీఐని తయారు చేయడానికి ఎంఎ్‌సడీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నేడు ఆప్టిమస్ విడుదల..
హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా గురువారం మోల్పుపిరవిర్ 200 ఎంజీ కాప్సూల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ‘మోల్‌కొవిర్’ బ్రాండ్‌తో విక్రయించనుంది. ఆప్టిమస్ ఫార్మా ఫార్ములేషన్ తయారీ అవసరమైన ఏపీఐని సొంతగా అభివృద్ధి చేసుకుంది. దేశీయ మార్కెట్‌లోకి ‘మోల్నునాట్’ బ్రాండ్‌తో వారం రోజుల్లో మోల్పుపిరవిర్‌ను విడుదల చేయనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ధర అందరికీ ఆమోదయోగ్యంగా ఉండగలదని వెల్లడించింది. డాక్టర్ రెడ్డీస్ మోల్‌ఫ్లూ పేరుతో 200 ఎంజీ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌ను త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ‘మోవ్‌ఫర్’ పేరుతో మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌ను హెటిరో గ్రూప్ విక్రయించనుంది. గ్రూప్ కంపెనీ హెటిరో హెల్త్‌కేర్ 200 ఎంజీ సామర్థ్యం ఉన్న 40 క్యాప్సూల్స్ ప్యాక్‌ను (పూర్తి కోర్సు) మార్కెట్‌లోకి తీసుకురానుందని హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారధి రెడ్డి తెలిపారు. హైదరాబాద్, హిమాచల్‌ప్రదేశ్‌లలోని అత్యాధునిక యూనిట్లలో క్యాప్సూల్స్‌ను తయారు చేయనున్నట్లు చెప్పారు. సిప్‌మోల్ను బ్రాండ్‌తో సిప్లా మోల్నుపివిర్ క్యాప్సూల్స్‌ను విక్రయించనుంది. మోల్నుటర్ బ్రాండ్‌తో టోరెంట్ విడుదల చేయనుంది. ‘మోలెక్స్‌వీర్’ బ్రాండ్‌తో మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌ను విక్రయించనున్నట్లు సన్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది.
బ్రిటన్, అమెరికా తర్వాత..
కరోనా-19 చికిత్సకు ఎంఎ్‌సడీ, రిడ్జ్‌బ్యాక్ కంపెనీలు అభివృద్ధి చేసిన నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ ఔషధం మోల్నుపిరవిర్‌కు గత నెలలో బ్రిటన్ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఇటీవల యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదించింది. మంగళవారం భారత్‌కు చెందిన డీసీజీఐ మోల్నుపిరవిర్ వినియోగానికి పచ్చజెండా ఊపింది.