మోల్నుపిరావిర్‌పై పరీక్షలు పూర్తి
ABN , First Publish Date - 2021-10-29T08:50:20+05:30 IST
మోల్నుపిరావిర్‌పై హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా మూడో దశ క్లినికల్ పరీక్షలను పూర్తి చేసింది.
ఆప్టిమస్ ఫార్మా వెల్లడి
లైసెన్సింగ్ అథారిటీకి డేటా సమర్పణ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మోల్నుపిరావిర్‌పై హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా మూడో దశ క్లినికల్ పరీక్షలను పూర్తి చేసింది. నోటి ద్వారా తీసుకునే మోల్నుపిరావిర్ (టాబ్లెట్లు)పై మూడో దశ పరీక్షలను పూర్తి చేసిన మొదటి కంపెనీ ఇదే అవుతుంది. క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి మే నెలలో ఆప్టిమ్‌సకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డేటాను సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకుసమర్పించినట్లు ఆప్టిమస్ ఫార్మా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అత్యవసర వినియోగ అనుమతి లభిస్తే మోల్నుపిరావిర్ టాబ్లెట్లను తయారు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు.
29 చోట్ల పరీక్షలు:
దేశవ్యాప్తంగా 29 చోట్ల క్లినికల్ పరీక్షలను నిర్వహించగా. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇతర చికిత్స ఐచ్ఛికాల కన్నా మోల్నుపిరావిర్ మెరుగైనదా కాదా అనే అంశాన్ని తెలుసుకోవడంతో పాటు భారత్‌లోని భిన్నమైన జీన్స్ కలిగిన ప్రజల్లో మోల్నుపిరావిర్ సమర్థతను తెలుసుకోవడానికి ఈ పరీక్షలను చేపట్టినట్లు కంపెనీ వివరించింది. కొవిడ్‌కు ఆమోదయోగ్యమైన వ్యయంలో అత్యుత్తమ చికిత్సను అందించడం ఆప్టిమస్ లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని చేరడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన మోల్నుపిరావిర్ ఫార్ములేషన్ దోహదం చేస్తుందని వివరించారు. ఐదు రోజుల అధ్యయనంలో చికిత్స పొందిన 78.4 శాతం మంది రోగులు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. ప్లాసిబో గ్రూప్‌లో ఇది 48.2 శాతం ఉంది. 10 రోజుల అధ్యయనంలో 91.5శాతం మంది రోగుల్లో కొవిడ్ పోయిందని పేర్కొంది.
ఒక్కో టాబ్లెట్ ధర రూ.30!
అనుమతి లభిస్తే నెలకు 8 కోట్ల టాబ్లెట్లను కంపెనీ ఉత్పత్తి చేసే వీలుంది. ఒక్కో టాబ్లెట్ ధర 40 సెంట్లు (దాదాపు రూ.30) ఉండే అవకాశం ఉంది. కొవిడ్ సోకిన వారు మొత్తం 40 టాబ్లెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు 16 డాలర్లు (రూ.1,200) ఖర్చవుతుంది. భవిష్యత్తులో ధర మరింత తగ్గొచ్చు. మోల్నుపిరావిర్‌ను మెర్క్ అండ్ కో అభివృద్ధి చేసింది.