ఆర్ఐఎల్ లాభం రూ.12,273 కోట్లు
ABN , First Publish Date - 2021-07-24T06:52:36+05:30 IST
ముకేశ్ అంబానీ సారథ్యంలోని కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్)..

- భారీగా పెరిగిన ఆదాయం
- దెబ్బతీసిన వ్యయాలు
- ల్యాంకో ఇన్ఫ్రాది ‘మోసపూరిత’ ఖాతా
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.12,273 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.13,233 కోట్లతో పోల్చితే లాభం 7 శాతం తగ్గింది. అయితే కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.91,238 కోట్ల నుంచి రూ.1,44,372 కోట్లకు పెరిగింది. కరోనా 2.0 ప్రభావంతో రిటైల్ వ్యాపార విభాగంలో ఏర్పడిన అంతరాయాలే లాభం తగ్గడానికి కారణమని ఆర్ఐఎల్ తెలిపింది. ఇతర వ్యాపార విభాగాలు మాత్రం పునరుజ్జీవం సాధించినట్టు తెలిపింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,845 కోట్లతో పోల్చితే మాత్రం లాభం 13 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం ఎబిటా మాత్రం రూ.27,550 కోట్లున్నదని, ఒక త్రైమాసికంలో ఆర్జించిన రికార్డు ఇదేనని పేర్కొంది. పన్నులు సహా ఇతర వ్యయాలన్నీ 50 శా తం మేరకు పెరిగాయని, ఫలితంగా త్రైమాసికంలో రూ.1.31 లక్షల కోట్లు ఖర్చయిందని పేర్కొంది. ఇందులో పన్ను వ్యయా లు రూ.3,464 కోట్లుగా ఉన్నాయి.
మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు
మెరుగైన రిఫైనింగ్, పెట్రో కెమికల్ మార్జిన్ల మద్దతుతో ఆర్ఐఎల్కు కామధేనువు వంటి ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) విభాగం మంచి వృద్ధిని నమోదు చేసింది. మొత్తం వ్యాపారాల్లో ఓ2సీ విభాగం వాటా 44 శాతం ఉన్నదని, ఈ విభాగం ఎబిటా 50 శాతం పెరిగి రూ.12,231 కోట్లకు చేరిందని తెలిపింది. క్రూడాయిల్‌ను శుద్ధ ఇంధనంగా మార్చడంలో లభించే ఆదాయం కూడా పెరిగింది. ఇన్వెంటరీ లాభాలు కూడా ఈ విభాగం మెరుగైన ఫలితాలు నమోదు చేయడానికి సహాయకారిగా నిలిచాయి. తూర్పు తీరంలోని కేజీ-డి6 బ్లాక్‌లో కొత్తగా కనుగొన్న క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత ఓ2సీ విభాగం వరుసగా మూడు త్రైమాసికాలు పన్ను చెల్లింపుల ముందు లాభాలు నమోదు చేసింది.
జియో లాభం రూ.3,651 కోట్లు
ఆర్ఐఎల్ టెలికాం విభాగం.. జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం ఏకంగా 45 శాతం పెరిగి రూ.3651 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారునిపై రూ.138.4 ఆదాయం (ఆర్పూ) నమోదైంది. అధిక శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం, విద్యార్థులు ఆన్లైన్లో చదువు సాగించడం వల్ల డేటా, వాయిస్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. త్రైమాసికంలో మొత్తం డేటా ట్రాఫిక్ 203 జీబీగా ఉంది. జూన్ 30 నాటికి కస్టమర్ల సంఖ్య 44.06 కోట్లకు చేరింది. త్రైమాసికంలో చేరిన కొత్త కస్టమర్ల సంఖ్య 4.23 కోట్లుంది. సేవలపై ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.22,267 కోట్లకు చేరింది. త్రైమాసికం ఎబిటా రూ.8892 కోట్లు.
రిటైల్ రాబడి రూ.38,547 కోట్లు
రిటైల్ విభాగం పన్ను చెల్లింపుల ముందు లాభం 79.88 శాతం పెరిగి రూ.1,941 కోట్లుగా నమోదైంది.గత ఏడాది ఇదే త్రైమాసికం ఎబిటా రూ.10.79 కోట్లు. రిటైల్ విభాగం ఆదాయాల్లో 19.04 శాతం వృద్ధి ఏర్పడింది. గత ఏడాది క్యూ 1లో ఆర్జించిన రూ.28,197 కోట్లతో పోల్చితే ఈ త్రైమాసికంలో ఇది రూ.33,566 కోట్లకు చేరింది. అమ్మకాలు, సేవల ద్వారా లభించిన మొత్తం ఆదాయం 21.90 శాతం పెరిగి రూ.38,547 కోట్లకు చేరింది. నికర లాభం రూ.962 కోట్లు. గత ఏడాది క్యు1తో పోల్చితే ఇది 123.2 శాతం అధికం. అయితే ప్రాంతీయ లాక్డౌన్ల కారణంగా స్టోర్ల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడడం వల్ల మొత్తం ఆదాయం మాత్రం 18.09 శాతం క్షీణించి రూ.38,547 కోట్లకు పరిమితమైంది. లాక్డౌన్ల కారణంగా 123 కొత్త స్టోర్లను మాత్రమే ప్రారంభించగలిగామని, దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 12,803కి చేరిందని తెలిపింది. మరో 700 స్టోర్లు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ కరోనా ఆంక్షలు ఎత్తివేయగానే కొత్త స్టోర్లపై దృష్టి సారిస్తామని తెలియచేసింది. లాక్డౌన్ కారణంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ డిజిటల్ కామర్స్ విభాగం ఆ నష్టాలు పూడ్చుకునేందుకు దోహదపడిందని పేర్కొంది.
కరోనా రెండో విడత కారణంగా సవాళ్లతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేయటం ఆనందదాయకం. వినియోగ ప్రాధాన్యం గల విభిన్న వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నందు వల్లనే ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలిచే శక్తి ఇచ్చిందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం.
- ముకేశ్ అంబానీ
