అక్టోబర్ నుంచి మళ్లీ రుణ మేళాలు
ABN , First Publish Date - 2021-08-26T06:46:33+05:30 IST
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్సబీ) మళ్లీ ‘రుణ మేళా’లు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ వితరణ వృద్ది రేటు పెంచేందుకు పీఎ్సబీలు అక్టోబరులో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు..
పీఎస్బీలకు ఆర్థిక మంత్రి హుకుం..
రుణాల వృద్ధి రేటు పెంచడమే లక్ష్యం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్సబీ) మళ్లీ ‘రుణ మేళా’లు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ వితరణ వృద్ది రేటు పెంచేందుకు పీఎ్సబీలు అక్టోబరులో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బుదవారం పీఎ్సబీల సీఈఓలతో జరిగే భేటీలో ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. సమావేశం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పారు. దీంతో గత ఏడాది కాలంగా పక్కన పెట్టిన పీఎ్సబీల రుణ మేళాలు మళ్లీ ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కొవిడ్ తర్వాత పీఎ్సబీల పరపతి వృద్ధి రేటు ఆరు శాతం మించి లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీతారామన్ పీఎ్సబీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.
డిమాండ్కూ ఊతం
పీఎ్సబీలు ఆర్థిక మంత్రి ఆదేశాల్ని పాటిస్తే వినియోగంతో పాటు జీడీపీ వృద్ధికీ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మొండి బకాయిల (ఎన్పీఏ) భయంతో అప్పులిచ్చేందుకు బ్యాంకులు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నాయి. అన్ని అర్హతలు ఉన్నా సవాలక్ష షరతులు పెడుతున్నాయి.
గిరాకీకి ఢోకా లేదు
రుణాలకు గిరాకీ లేదన్న బ్యాంకర్ల వాదనను ఆర్థిక మంత్రి తోసిపుచ్చారు. అలా చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. రుణ వితరణ పెంచేందుకు బ్యాంకులు అక్టోబరు నుంచి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించాలని కోరారు. ఇలాంటి చర్యలతో కొవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలకూ ఊతం లభిస్తుందన్నారు.
ఒక జిల్లా-ఒక ఉత్పత్తి
రుణ వితరణను పెంచుకునేందుకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలనూ సీతారామన్ పీఎ్సబీల అధిపతులకు వివరించారు. ఇందుకోసం ‘ఒక జిల్లా -ఒక ఉత్పత్తి’ విధానం అనుసరించాలన్నారు. ప్రత్యేకించి ఆయా జిల్లాల్లోని ఎగుమతిదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని సూచించారు. జిల్లాల్లోని ఎగుమతి, వాణిజ్య సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు ఎగుమతి సంస్థల రుణ అవసరాలు తెలుసుకోవాలని కోరారు.
రూ.4.94 లక్షల కోట్ల రుణాలు
2019 అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు బ్యాంకులు వివిధ రంగాలకు రూ.4.94 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశా రు. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఫిన్టెక్ కంపెనీల రుణ అవసరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
విదేశాల్లో నేరుగా లిస్టింగ్
దేశీయ కంపెనీలు తమ షేర్లు, రుణ పత్రాలను విదేశాల్లోని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నేరుగా లిస్ట్ చేసేందుకూ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. వచ్చే బడ్జెట్ సమావేశంలో దీనికి వీలు కల్పించే చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం దేశీయా కంపెనీలు ఏడీఆర్లు లేదా జీడీఆర్ల రూపంలో ఆయా దేశాల కరెన్సీల్లో షేర్లు, రుణ పత్రాలు జారీ చేస్తూ విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతున్నాయి.
బీమా నుంచి పూర్తిగా తప్పుకోం
బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి వ్యూహాత్మకంగా కీలకమైన కంపెనీల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకునే యోచన లేదని సీతారామన్ స్పష్టం చేశారు. కాకపోతే కనీస స్థాయిలోనే ఈ కంపెనీల్లో ప్రభుత్వ వాటా ఉంటుందన్నారు. దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు సిద్దమవు తున్న తరుణంలో ఆర్థిక మంత్రి ఈ విషయం చెప్పడం విశేషం.