సులభంగా క్లెయిమ్స్ సెటిల్‌మెంట్స్: ఎల్‌ఐసీ
ABN , First Publish Date - 2021-05-08T08:42:52+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిబంధనల్ని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మరింత సులభం చేసింది. కొవిడ్ డెత్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ల కోసం మున్సిపాలిటీలు, నగర పాలక

ముంబై: కొవిడ్ నేపథ్యంలో క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిబంధనల్ని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మరింత సులభం చేసింది. కొవిడ్ డెత్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ల కోసం మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇచ్చే మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లకు ప్రత్యామ్నాయ సర్టిఫికెట్లనూ ఆమోదించనున్నట్టు తెలిపింది. ఆస్పత్రులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లు, డిశ్చార్జ్ సమ్మరీ లేదా డెత్ సమ్మరీ సర్టిఫికెట్లనూ ఆమోదిస్తారు. కాకపోతే ఈ సర్టిఫికెట్లపై ఎల్‌ఐసీ క్లాస్-1 అధికారులుగానీ, కనీసం పదేళ్ల సీనియారిటీ ఉన్న డెవల్‌పమెంట్ అధికారులు గానీ కౌంటర్ సంతకం చేయాలి. మృతుని దహనం, ఖననానికి సంబంఽధించి ఆయా స్మశాన వాటికల అధికారులు జారీ చేసే రసీదులతో కలిపి పై పత్రాలను ఎల్‌ఐసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇతర డెత్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్స్ కోసం మాత్రం గతంలోలా ఆయా మున్సిపాలిటీలు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది.
ఇతర వెసులుబాట్లు
మెచ్యూరిటీ/సర్వైవల్ బెనిఫిట్ సెటిల్‌మెంట్ క్లెయిమ్స్‌కు అవసరమైన పత్రాలను ఆయా సర్వీస్ శాఖల్లోనే కాకుండా సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ ఆఫీసుల్లోనూ సమర్పించవచ్చు
ఈ సంవత్సరం అక్టోబరు వరకు రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఆప్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు
ఇతర కేసుల్లో మాత్రం లైఫ్ సర్టిఫికెట్లను ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు
కొత్త పాలసీల కొనుగోలు, ఉన్న పాలసీలకు ప్రీమియం చెల్లింపు, లోన్ అప్లికేషన్స్, రుణాల చెల్లింపు వంటి సేవలను ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.