మొబైల్ ఫోన్ వ్యాపారానికి ఎల్‌జీ గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-03-22T22:41:46+05:30 IST

ఎల్‌జీ మొబైల్ ఫోన్ల వైభవం ఇక గత చరిత్ర కానున్నట్టు తెలుస్తోంది. అమ్మకాలు, కార్యాచరణ ప్రణాళికల్లో తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్న...

మొబైల్ ఫోన్ వ్యాపారానికి ఎల్‌జీ గుడ్‌బై!

న్యూఢిల్లీ: ఎల్‌జీ మొబైల్ ఫోన్ వైభవం ఇక గత చరిత్ర కానుందా? అమ్మకాలు, కార్యాచరణ ప్రణాళికల్లో తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్న కారణంగా ఇక మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని ఈ దక్షిణ కొరియా కంపెనీ నిర్ణయించుకుందా? అంటే అవుననే అంటున్నాయి ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వర్గాలు. ఈ మేరకు దక్షిణ కొరియా పత్రిక డోంగా ఇల్బో ఇవాళ ఓ కథనం ప్రచురించింది. తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్‌జీ ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు బడా కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచిచూసేబదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్‌కు ముగింపు పలకాలని ఎల్‌జీ భావిస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్ పరిశ్రమ నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని వివరిస్తూ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు సమాచారం. గత ఐదేళ్లలో ఎల్‌జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్ నుంచి వైదొలగాలని కంపెనీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టేందుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తున్నామంటూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

Updated Date - 2021-03-22T22:41:46+05:30 IST