పీఎఫ్ డిపాజిట్లపై గతేడాది వడ్డీయే...
ABN , First Publish Date - 2021-10-30T04:12:43+05:30 IST
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డిపాజిట్లపై కిందటి సంవత్సరం వడ్డీ రేటే(8.5 %) కొనసాగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటును 8.5 శాతంగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

హైదరాబాద్ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డిపాజిట్లపై కిందటి సంవత్సరం వడ్డీ రేటే(8.5 %) కొనసాగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటును 8.5 శాతంగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అరవై మిలియన్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ వడ్డీ మొత్తాన్ని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌ఓ) జమచేయనుంది.
లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముందే వడ్డీ రేటును కేంద్ర కార్మిక శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నందున... ఇందుకు సంబంధించిన నోటిఫై కార్యక్రమం త్వరలో జరగనుంది. కిందటి ఆర్థిక సంవత్సరం మిగుళ్లు రూ. వెయ్యి కోట్లతో పోలిస్తే, ఈ నిర్ణయం కారణంగా ఈపీఎఫ్‌ఓ వద్ద మిగుళ్లు రూ. 300 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు.
కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్‌ఓ గతేడాది కూడా ఎనిమిదిన్నర శాతం వడ్డీనిచ్చింది. అదే రేటును ఇప్పుడు కూడా ఈపీఎఫ్‌ఓ 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్' ఆమోదించింది. దీనిపై, ఈ నెల మొదట్లోనే ఆర్థిక శాఖ అధికారులను కలిసిన కార్మిక శాఖ అధికారులు... సంబంధిత ప్రక్రియను వేగవంతం చేశారు.
తన ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా సుమారు రూ. 4 వేల కోట్లు, డెట్స్ నుంచి రూ. 65 వేల కోట్లు సహా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 70,300 కోట్ల ఆదాయాన్ని ఈపీఎఫ్‌ఓ అంచనా వేస్తోంది. దీని ఆధారంగానే 2021 ఆర్ధిక సంవత్సరానికిగాను 8.5 % వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఈపీఎఫ్‌ఓకు 60 మిలియన్ల కంటే ఎక్కువ యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్న విషఫయం తెలిసిందే. ఏటా వీరి నుంచి వచ్చే డబ్బులో 15 % ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెడతారు.