సమగ్ర ‘బయోలాజిక్స్’ కంపెనీగా లారస్!
ABN , First Publish Date - 2021-07-08T07:02:56+05:30 IST
వచ్చే నాలుగైదేళ్లలో బయోలాజిక్స్ రంగంలో సమగ్ర సీడీఎంఓ (కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్) కంపెనీగా అభివృద్ధి చెందాలని లారస్ ల్యాబ్స్ భావిస్తోంది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే నాలుగైదేళ్లలో బయోలాజిక్స్ రంగంలో సమగ్ర సీడీఎంఓ (కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్) కంపెనీగా అభివృద్ధి చెందాలని లారస్ ల్యాబ్స్ భావిస్తోంది. ఎక్కువ మందికి ఈ విభాగంలోకి ప్రవేశించే సామర్థ్యాలు లేకపోవడం, మెరుగైన మార్జిన్లు, ఆకర్షణీయ ఆదాయం లభించే అవకాశాలు మొదలైన సానుకూలతలను పరిగణనలోకి తీసుకుని బయోలాజిక్స్‌పై దృష్టి కేంద్రీకరిచాలని యోచిస్తోంది. ఇటీవల కొనుగోలు చేసిన లారస్ బయో (రిచ్‌కోర్) ఈ విభాగంలో పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంచగలదని అంచనా. బయోలాజిక్స్ సీడీఎంఓ విభాగంలో ఎండ్-టు-ఎండ్ సేవలను అందించడానికి కూడా ఇది దోహదం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.8 లక్షల లీటర్ల ఫెర్మెంటేషన్ సామ ర్థ్యం అందుబాటులోకి రానుంది. మొత్తం ఫెర్మెంటేషన్ సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. సమగ్ర బయోలాజిక్స్ సీడీఎంఓ కంపెనీగా లారస్ ల్యాబ్స్ బలపడేందుకు పెరిగే ఫెర్మెంటేషన్ సామర్థ్యాలు దోహదం చేయనున్నాయి. ఈ వ్యాపారం నుంచి ప్రస్తుతం దాదాపు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లలో ఇది రెండు, మూడింతలయ్యే వీలుందని, అయిదారేళ్లలో ఈ విభాగం నుంచి లభించే ఆదాయం గణనీయంగా పెరగగలదని భావిస్తున్నారు.