రూ.5.80 లక్షల కోట్లు ఉఫ్‌

ABN , First Publish Date - 2021-12-07T06:18:14+05:30 IST

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి భయాలతో ఈక్విటీ మదు పర్లు సోమవారం అమ్మకాలు పోటెత్తించారు.

రూ.5.80 లక్షల కోట్లు ఉఫ్‌

ముంబై: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి భయాలతో ఈక్విటీ మదు పర్లు సోమవారం అమ్మకాలు పోటెత్తించారు. రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్‌బీఐ పరపతి సమీక్ష నేపథ్యంలో ట్రేడర్ల ముందు జాగ్రత్త ధోరణి స్టాక్‌ మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. దాంతో ప్రామాణిక సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 949.32 పాయింట్లు (1.65 శాతం) క్షీణించి 56,747.14 వద్దకు జారుకుంది. సూచీకిది మూడు నెలలకు పైగా కనిష్ఠ ముగింపు స్థాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 284.45 పాయింట్లు (1.65 శాతం) పతనమై 16,912.25 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీలూ నేలచూపులు చూశాయి. అన్నిటికంటే అధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 3.75 శాతం కోల్పోయింది. అమ్మకాల హోరులో స్టాక్‌ మార్కెట్‌ సంపద ఒక్కరోజే రూ.4.29 లక్షల కోట్లు క్షీణించింది. దాంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.256.72 లక్షల కోట్లకు పరిమితమైంది. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో మార్కెట్‌ రూ.5.80 లక్షల కోట్ల సంపద కోల్పోయింది. 


8 వారాల కనిష్ఠానికి రూపాయి 

దేశీయ కరెన్సీ విలువ ఎనిమిది వారాల కనిష్ఠానికి తగ్గింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఏకంగా 33 పైసలు బలహీనపడి రూ.75.45 వద్దకు చేరుకుంది. ఒమైక్రాన్‌ వ్యాప్తి భయాలు, ఈక్విటీ మార్కెట్‌ నష్టాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు రూపాయి విలువకు గండికొట్టాయని ఫారెక్స్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 


మ్యాప్‌మైఇండియా ఆఫర్‌ 9న ప్రారంభం  

డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ మ్యాప్‌మైఇండియా ఐపీఓ ఈనెల 9న ప్రారంభమై 13న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూలో విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని  కంపెనీ రూ.1,000-1,033గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,040 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


రేపటి నుంచి శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ఇష్యూ

ఈ వారం ఐపీఓకు రానున్న మరో కంపెనీ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌. ఈ నెల 8న మొదలై 10న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని కంపెనీ రూ.113-118గా నిర్ణయించింది. అంతేకాదు, ఇష్యూ సైజును గతంలో ప్రకటించిన రూ.800 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించుకుంది. 

Updated Date - 2021-12-07T06:18:14+05:30 IST