క్రిప్టోల కథ కంచికే

ABN , First Publish Date - 2021-11-25T09:07:48+05:30 IST

క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు......

క్రిప్టోల కథ కంచికే

విలువలు గాలి బుడగలు , మిగిలేవి ఒకటో  రెండో: రాజన్‌


న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి విలువ గాలి బుడగల్లా మారిందన్నారు. వీటికి ‘శాశ్వత’ విలువ కూడా లేదన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న దాదాపు 6,000 క్రిప్టో కరెన్సీల్లో ఒకటి రెండు లేదా అతి కొద్ది కరెన్సీలు మాత్రమే మిగులుతాయని సీఎన్‌బీసీ టీవీ18 టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. త్వరలోనే అల్లాటప్పా క్రిప్టో కరెన్సీల అంతర్థానం ప్రారంభం అవుతుందన్నారు. వేలం వెర్రిగా కొంత మంది కొనడం వల్లనే క్రిప్టోల విలువ చుక్కలంటుతోందని వ్యాఖ్యానించారు.


చిట్టీల్లాంటివే :  క్రిప్టో కరెన్సీలను రాజన్‌ చిట్‌ఫండ్స్‌తో పోల్చారు. జనం నుంచి నిధులు సేకరించి కొన్ని చిట్‌ఫండ్‌ సంస్థలు టోపీ పెట్టినట్టు, క్రిప్టోకరెన్సీల నిర్వాహకులూ టోపీ పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు నిండా మునగడం ఖాయమన్నారు. 


విలువ డొల్లే : క్రిప్టో కరెన్సీలకు ‘శాశ్వత’ విలువేదీ లేని విషయాన్ని రాజన్‌ గుర్తు చేశారు. దీంతో వీటి ధరలు పతనమైనపుడు, మదుపరులు నిండా మునగడం ఖాయమన్నారు. అయితే క్రిప్టోకరెన్సీల కోసం ఉపయోగిస్తున్న బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని మాత్రం ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలని రాజన్‌ సూచించారు. 


నిషేధానికి తొందరొద్దు 

ప్రభుత్వం ప్రైవేటు క్రిప్టోల నిషేధానికి పావులు కదుపుతున్న దశ లో ఆ రంగానికి చెందిన వారు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని బైయూకాయిన్‌ సీఈఓ శివం తక్రాల్‌ కోరారు. ఉన్నపళంగా నిషేధం విధిస్తే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఫలితాలు దేశానికి అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెలుసుబాటు విధానం అనుసరించాలని కోరారు. అవసరమనుకుంటే భారత స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో నమోదయ్యే షరతుపై బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలను  అనుమతించాలన్నారు. 


‘క్రిప్టో’లు వద్దే వద్దు

ప్రజల్లోనూ క్రిప్టో కరెన్సీలపై భయాలు నెలకొన్నాయి. డిజిటల్‌ కమ్యూనిటీసంస్థ లోకల్‌ సర్కిల్స్‌ జరిపిన సర్వేలో 54 శాతం మంది వీటికి చట్ట బద్దత కల్పించవద్దన్నారు. దేశ వ్యాప్తంగా 342 జిల్లాల నుంచి 56,000 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నివేదిక రూపొందించారు. కేవలం 26 శాతం మంది క్రిప్టోలకు ఓటేశారు. వీరంతా క్రిప్టోలకు చట్టబద్దత కల్పించడంతో పాటు, వాటి లాభాలపై పన్నులు విధించాలన్నారు. 54 శాతం మంది మాత్రం వీటికి చట్ట బద్దత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూనే, వాటిని విదేశీ డిజిటల్‌ ఆస్తులుగా పరిగణించి, పన్నులు విధించాలని సూచించినట్టు లోకల్‌ సర్కిల్స్‌ పేర్కొంది. 

Updated Date - 2021-11-25T09:07:48+05:30 IST