తెలంగాణలో ‘కైటెక్స్’ గార్మెంట్స్ ప్లాంట్ !
ABN , First Publish Date - 2021-07-09T06:47:34+05:30 IST
కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. దీనిపై చర్చించేందుకు ఆ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్ శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు.
- రూ.3,500 కోట్ల పెట్టుబడులు
- నేడు హైదరాబాద్‌కు కంపెనీ చైర్మన్ సాబూ జాకబ్
- ప్రత్యేక విమానం పంపిన తెలంగాణ ప్రభుత్వం
కోచి : కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. దీనిపై చర్చించేందుకు ఆ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్ శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక విమానం పంపినట్టు ఆయన చెప్పా రు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండి పెట్టుబడి అవకాశాలపై చర్చిస్తామన్నారు. ఈ పర్యటనలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతోనూ సమావేశం కానున్నట్టు జాకబ్ చెప్పారు. ‘రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా కోసం ప్రత్యేక విమానం పంపిస్తోంది. నాతో పాటు మా అధికారులు అయిదారుగురు వస్తారు. రెండు రోజులపాటు అక్కడ పెట్టుబడి అవకాశాలపై చర్చించి శనివారం మళ్లీ కోచి వస్తాం’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో కైటెక్స్ గ్రూప్ సంస్థ కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్.. దుస్తుల తయారీ యూనిట్‌కు స్థలంతో పాటు పలు రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం.
కేరళకు గుడ్‌బై ?
కేరళకు చెందిన కైటెక్స్ గ్రూప్.. కొచ్చిన్ సమీపంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో గార్మెంట్స్ తయారీ యూనిట్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గత ఏడాది జరిగిన పెట్టుబడుల సదస్సులో కేరళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. అయితే ఇప్పటికే కేరళలో ఉన్న కైటెక్స్ గ్రూప్ కంపెనీలపై అదేపనిగా అధికారుల తనిఖీలతో కైటెక్స్ తన నిర్ణయాన్ని మా ర్చుకుంది. అంతేకాకుండా కేరళలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏ మాత్రం లేవని జాకబ్ ఆరోపించారు.
ఏపీ నుంచీ ఆహ్వానం
కైటెక్స్ గ్రూప్ దుస్తుల తయారీ యూనిట్ కోసం ఇతర రాష్ట్రాలూ పోటీపడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచీ ఆహ్వానాలు అందినట్టు జాకబ్ చెప్పారు. కేరళలో రూ.3,500 కోట్ల దుస్తుల తయారీ యూనిట్‌కు గుడ్‌బై చెప్పినట్టేనా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘అది వేరే విషయం. ప్రస్తుతం ఆ విషయం వెల్లడించలేను’ అన్నారు.
