ఈ-కామర్స్ దిగ్గజాలకు కళ్లెం
ABN , First Publish Date - 2021-01-20T08:55:19+05:30 IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ ఈకామర్స్ దిగ్గజాలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనల్లో మరిన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు సమాచారం.

ఎఫ్‌డీఐ రూల్స్‌లో మార్పులు !.. చిరు వ్యాపారులకు రక్షణ
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ ఈకామర్స్ దిగ్గజాలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనల్లో మరిన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సంస్థల అడ్డగోలు డిస్కౌంట్ల బారి నుంచి దేశీయ కిరాణా దుకాణాల యజమానుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రభుత్వం దీనిపై ఇంకా నోరు మెదపడం లేదు. అయితే దీనిపై ఇప్పటికే ఒక సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు చెప్పాయి.
ఎందుకంటే ?
పండగలు, ప్రత్యేక సేల్స్ పేరుతో ఈకామార్స్ దిగ్గజాలు ప్రకటించే భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారులు పోటీపడలేక పోతున్నారు. లాభాలు లేకపోయినా మార్కెట్‌ను కబళించే వ్యూహారంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ దిగ్గజాలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దీంతో దేశంలోని చిరు వ్యాపారుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ పద్దతి మార్చుకోండని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఇప్పటికే అనేక సార్లు ఈ సంస్థలను సుతిమెత్తగా హెచ్చరించారు. అయినా ఈ సంస్థల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అవెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల అడ్డగోలు డిస్కౌంట్ల బారి నుంచి మమ్మల్ని రక్షించండి మహా ప్రభో అని చిరు వ్యాపారులు సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్టు భావిస్తున్నారు.
ప్రస్తుత నిబంధనలు
ఇపుడున్న నిబంధనల ప్రకారం విదేశీ ఈకామర్స్ వెబ్సైట్లలో సరుకులు, వస్తువులు అమ్మే అమ్మకందార్ల కంపెనీల్లో, విదేశీ ఈకామర్స్ దిగ్గజాలకు ఈక్విటీ వాటాను అనుమతించరు. అలా వాటా ఉంటే, ఆ కంపెనీల సరుకులు, వస్తువులను, ఆ ఈకామర్స్ సంస్థల వెబ్సైట్లలో అమ్మేందుకు వీల్లేదు. 2018లో ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఇది తమ కంపెనీలపై వివక్ష చూపడమేనని అమెరికా అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిబంధనలకు తూట్లు
ఈ నిబందనకు గండి కొట్టేందుకు విదేశీ ఈ కామర్స్ దిగ్గజాలు నేరుగా కాకుండా, తమ మాతృ లేదా అనుబంధ సంస్థల ద్వారా అమ్మకందార్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు అందుకు కూడా అవకాశం లేకుండా ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దేశీయ ఆన్లైన్ అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న రెండు పెద్ద కంపెనీల్లో అమెజాన్‌కు పరోక్షంగా వాటా ఉంది. దీంతో ఈ మార్పులు అమల్లోకి వస్తే అమెజాన్ ఇండియాకు గట్టి దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు.