15 సంవత్సరాలు ఆగమాగమే...
ABN , First Publish Date - 2021-01-20T08:32:43+05:30 IST
కొవిడ్-19 మహమ్మారి రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో ఆస్తుల గాలిబుడగలు ఏర్పడేందుకు, ధరల అనిశ్చితి, కమోడిటీ షాక్‌లు, రుణ సంక్షోభాలకు కారణమవుతుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది.

న్యూఢిల్లీ/జెనీవా: కొవిడ్-19 మహమ్మారి రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో ఆస్తుల గాలిబుడగలు ఏర్పడేందుకు, ధరల అనిశ్చితి, కమోడిటీ షాక్‌లు, రుణ సంక్షోభాలకు కారణమవుతుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ నెల 25-29 తేదీల మధ్య వర్చువల్‌గా జరగనున్న దావోస్ అజెండా శిఖరాగ్ర సదస్సుకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
2020లో చోటు చేసుకున్న చరిత్రలోనే దారుణమైన ఈ ప్రపంచ కల్లోలం దీర్ఘకాలిక రిస్క్‌లపై ప్రపంచ మానవాళిని నిద్రలేపిందంటూ కనీసం 15 ఏళ్ల పాటు ప్రపంచానికి మహమ్మారుల ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించింది. వాస్తవానికి 2006 సంవత్సరంలోనే డబ్ల్యూఈఎఫ్ మహమ్మారులు, ఆరోగ్య సంబంధిత రిస్క్‌లకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలందించినా ప్రపంచం దీర్ఘకాలిక రిస్క్‌లను విస్మరించడమే 2020 మహమ్మారికి కారణమని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల ఆధారంగా ప్రపంచానికి గల రిస్క్‌లను 2021 నివేదిక తొలిసారిగా వర్గీకరించింది.
నివేదిక ముఖ్యాంశాలు..
జీరో నుంచి రెండు సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచానికి అంటువ్యాధుల ముప్పు ఉంటుంది. వీటి కారణంగా ఉపాధి సంక్షోభం ఏర్పడడంతో పాటు డిజిటల్ అసమానతలు, యువతలో అసంతృప్తి ప్రబలుతుంది.
మధ్య కాలంలో ఆస్తుల బుడగలు పేలడం, ఐటీ మౌలిక వసతులు బ్రేక్‌డౌన్ కావడం, ధరల అస్థిరత, రుణ సంక్షోభాల వంటి పెను రిస్క్‌లుండవచ్చు.
వచ్చే 5-10 సంవత్సరాల మధ్య కాలంలో భారీ విధ్వంసక ఆయుధాలు, దేశాలు కుప్ప కూలడం, జీవ వైవిధ్య నష్టం, ప్రతికూల సాంకేతికతలు పెరిగిపోవడం వంటి రిస్క్‌లున్నాయి.
ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహం
భవిష్యత్ నిర్వహణా సామర్థ్యా లు పెంచుకునేందుకు అవసరమైన విభాగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించాలని డబ్ల్యూఈఎఫ్ నివేదిక సిఫారసు చేసింది. ఇది చేయకపోతే వ్యాపారాలు కుప్పకూలిపోవచ్చని, రుణ ఎగవేత ధోరణులు పెరిగిపోవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే బ్రెజిల్, ఇండియా, యూకేల్లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. అలాగే సామాజిక రంగం, ప్రపంచ సహకారం బలహీనం కావడంతో పాటుగా పేదరికం, అసమానతలు పెరిగిపోవచ్చునని హెచ్చరించింది. సరి కొత్త ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు సత్వర రూపకల్పన చేయడంపై ప్రభుత్వం, వ్యాపార, సామాజిక సంస్థలు దృష్టి కేంద్రీకరించాలని డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జహీదీ సూచించారు. ఇన్ని ప్రమాదాల మధ్యన కూడా ప్రజల్లో డిజిటల్ సాధనాల వినియోగం, డిజిటైజేషన్, ఈ-కామర్స్, ఆన్‌లైన్ విద్య, దూర ప్రాంతాల నుంచి పని చేయడం వంటి ధోరణులు పెరగడం ఒక సానుకకూలత అని ఆయన అన్నారు. డిజిటలైజేషన్‌తో 2025 నాటికి 10 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ నివేదిక అంచనా వేసింది. అయితే డిజిటల్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల 8.5 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకునే ఆస్కారం ఉంటుందని జ్యూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ పీటర్ గిగర్ అన్నారు.