భారత్.. యూనికార్న్‌ల అడ్డా
ABN , First Publish Date - 2021-09-03T06:41:51+05:30 IST
భారత్ యూనికార్న్‌ల అడ్డాగా అవతరిస్తోంది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.7,300 కోట్లు) విలువైన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. ఈ ఏడాది దేశంలోని యూనికార్న్‌ల సంఖ్య దాదాపు రెట్టింపైందని...

- ఈ ఏడాది లిస్ట్‌లోకి మరో 25 స్టార్ట్‌పలు
- ఆగస్టు చివరి నాటికి మొత్తం 51
- హురున్ ఇండియా నివేదిక వెల్లడి
ముంబై: భారత్ యూనికార్న్‌ల అడ్డాగా అవతరిస్తోంది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.7,300 కోట్లు) విలువైన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. ఈ ఏడాది దేశంలోని యూనికార్న్‌ల సంఖ్య దాదాపు రెట్టింపైందని హురున్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. గడిచిన 8 నెలల్లో 25 స్టార్ట్‌పలు యూనికార్న్ జాబితాలోకి చేరినట్లు తెలిపింది. అంటే, నెలకు సగటున 3 స్టార్ట్‌పలు ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. దాంతో, గత నెలాఖరు నాటికి దేశంలోని మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 51కి చేరుకుంది. గురువారం విడుదలైన ‘హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ లిస్ట్ 2021’ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- భారత్‌లోని ప్రస్తుత యూనికార్న్‌ల మొత్తం విలువ 16,800 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.12.26 లక్షల కోట్లకు పైమాటే. అంటే, ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జీడీపీ కంటే అధికం.
- భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా అవతరించేందుకు అవకాశమున్న స్టార్ట్‌పల మొత్తం విలువ 3,600 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.2.63 లక్షల కోట్లు. ఢిల్లీ జీడీపీలో మూడో వంతుకు సమానమిది.
- యూనికార్న్‌లుగా అవతరించే అవకాశమున్న స్టార్ట్‌పలలో అత్యధికం (31) బెంగళూరులో ఉన్నాయి. ముంబైలో 13, గురుగ్రామ్‌లో 12, ఢిల్లీ, నోయిడాలో 5 చొప్పున ఉన్నాయి.
- అత్యధిక యూనికార్న్‌లకు వేదికైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 396 యూనికార్న్‌లతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. చైనా (277) రెండో స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్ (32), జర్మనీ (18) వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నాయి.
- విజయ పథకంలో దూసుకెళ్తోన్న స్టార్ట్‌పల వ్యవస్థాపకుల్లో చాలా మంది ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్నవారే. వయసు పరంగా చూస్తే, 11 మంది వ్యవస్థాపకులు 30 ఏళ్లలోపు వారే. 15 మంది 50 ఏళ్ల పైబడినవారు.
32 జింకలు.. 54 చిరుతలు!
2000 సంవత్సరం తర్వాత స్థాపించిన స్టార్ట్‌పల్లో ప్రస్తుతం 50 కోట్ల డాలర్ల (రూ.3,650 కోట్లు) కంటే అధిక విలువ కలిగి ఉండి, వచ్చే రెండేళ్లలో యూనికార్న్‌లుగా అవతరించగలిగే స్టార్ట్‌పలను గజేల్ (హరిణజాతి జింక)గా అభివర్ణించిందీ నివేదిక. 20-50 కోట్ల డాలర్ల విలువైన స్టార్ట్‌పల్లో 4 ఏళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశమున్న వాటిని చిరుతలుగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 32 జింకలు, 54 చిరుతలున్నాయని నివేదిక అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా మారేందుకు అవకాశమున్న స్టార్ట్‌పల్లో జిల్లింగో, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్), రెబెల్ ఫుడ్స్, క్యూర్‌ఫిట్, స్పిన్నీ, రేట్‌గెయిన్, మామాఎర్త్, కార్‌దేఖో, గ్రేఆరెంజ్, మొబీక్విక్ ముందంజలో ఉన్నాయి.
విదేశాలకు వలస..
విధానపరమైన సంక్లిష్టతల కారణంగా భారత స్టార్ట్‌పల్లో కొన్ని విదేశాలకు తరలిపోతుండటంపై హురున్ నివేదిక హెచ్చరించింది. వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం మరింత సరళమైన చట్టాలు కలిగిన, సులభంగా పెట్టుబడుల సేకరించేందుకు అనువైన దేశాలను ఇందుకు ఎంచుకుంటున్నాయని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రహ్మాన్ జునైద్ అన్నారు. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (ఎస్‌ఏఏఎస్) రంగానికి కొన్ని ఉత్తమ స్టార్ట్‌పలు అమెరికాకు వలస వెళ్లాయని, లేదంటే దేశంలోని యూనికార్న్‌ల సంఖ్య మరింత పెరిగి ఉండేదన్నారు. విదేశాలకు వలసపోకుండా స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలు పెంచాలన్నారు.
భారత్‌లో 60 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 90 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా పెరుగుతుండటం దేశం లో టెక్నాలజీ ఆధారిత స్టార్ట్‌పలు మరింతగా వృద్ధి చెందేందుకు దోహదపడనుంది. ముఖ్యంగా, ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలోని మొబైల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, బ్లాక్‌చెయిన్, స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ లెండింగ్ కంపెనీలకు బాగా కలిసిరానుంది.
- అనాస్ రహ్మాన్ జునైద్,
హురున్ ఇండియా ఎండీ,
చీఫ్ రీసెర్చర్