లాగ్‌ 9 మెటీరియల్స్‌లో అమర రాజాకు వాటా

ABN , First Publish Date - 2021-08-10T09:20:21+05:30 IST

బెంగళూరుకు చెందిన అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ లాగ్‌ 9 మెటీరియల్స్‌ సైంటిఫిక్‌లో రూ.37 కోట్లకు 11.36 శాతం వాటాను అమర రాజా బ్యాటరీస్‌ సొంతం చేసుకోనుంది.

లాగ్‌ 9 మెటీరియల్స్‌లో అమర రాజాకు వాటా

  • రూ.37 కోట్లకు 11.36% కొనుగోలు
  • వచ్చే 5-7 ఏళ్లలో రూ.7,200 కోట్ల పెట్టుబడులు
  • ఐదేళ్లలో 200 కోట్ల డాలర్ల ఆదాయ లక్ష్యం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బెంగళూరుకు చెందిన అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ లాగ్‌ 9 మెటీరియల్స్‌ సైంటిఫిక్‌లో రూ.37 కోట్లకు 11.36 శాతం వాటాను అమర రాజా బ్యాటరీస్‌ సొంతం చేసుకోనుంది. 2015లో ఏర్పాటైన ఈ కంపెనీ.. క్రాస్‌ మెటల్స్‌, ఎలకో్ట్రడ్‌, సెల్‌, ప్యాకేజీ స్థాయి ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీలు తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పర్యావరణ అనుకూల ఎనర్జీ, మొబిలిటీ విభాగాల్లోకి విస్తరించటంతో పాటు ఇందుకోసం 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది జూన్‌లో అమర రాజా ప్రకటించింది. ఇందుకనుగుణంగానే లాగ్‌ 9 కంపెనీలో వాటాను కొనుగోలు చేసినట్లు అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి ప్రవేశించడంతో పాటు ఎనర్జీ, మొబిలిటీ రంగాల్లో అగ్ర స్థానానికి చేరేందుకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. పూర్తిగా నగదును చెల్లిచటం ద్వారా లాగ్‌ 9లో వాటాను అమర రాజా కొనుగోలు చేసింది. కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. పర్యావరణ అనుకూల ఆధునిక టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలనే వ్యూహానికి అనుగుణంగా లాగ్‌ 9లో వాటా కొనుగోలు చేసినట్లు అమరరాజా బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. 


వచ్చే ఏడేళ్లలో..

వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో అమర రాజా 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. భవిష్యత్తులో లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల ప్రాధాన్యం తగ్గి లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల ప్రాధాన్యం పెరగనున్నందున ఈ టెక్నాలజీల్లోకి ప్రవేశించాలని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకంలోని అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ విభాగం కింద 10 నుంచి 12 గిగావాట్‌ అవర్స్‌ సామర్థ్యం కలిగిన లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అమరరాజా ప్రెసిడెంట్‌ (న్యూ ఎనర్జీ విభాగం) ప్రెసిడెంట్‌ ఎస్‌ విజయానంద్‌ తెలిపారు. మార్కెట్లో లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీల గిరాకీని బట్టి ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకోసం 5-7 ఏళ్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. 


ఆదాయంలో 15-17% వృద్ధి

వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఆదాయం ఏడాదికి 15-17 శాతం వృద్ధి చెందగలదని, అప్పటికి  ఆదాయం 200 కోట్ల డాలర్లకు చేరగలదని విజయానంద్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.7,150 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీనిపై రూ.647 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 

Updated Date - 2021-08-10T09:20:21+05:30 IST