పసిడికి జోష్‌!

ABN , First Publish Date - 2021-10-31T09:34:53+05:30 IST

ఈ దీపావళి పండుగ సీజన్‌లో బంగారం విక్రయాలు కరోనా పూర్వ దశతో పోల్చితే 30 శాతం వరకు పెరగవచ్చని ఆభరణ వర్తకులు అంచనా వేస్తున్నారు....

పసిడికి జోష్‌!

దీపావళి విక్రయాల్లో 30% వరకు వృద్ధి

ముంబై: ఈ దీపావళి పండుగ సీజన్‌లో బంగారం విక్రయాలు కరోనా పూర్వ దశతో పోల్చితే 30 శాతం వరకు పెరగవచ్చని ఆభరణ వర్తకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక పునరుజ్జీవం అంచనాల కంటే వేగంగా జరుగుతుండటంతోపాటు ఈ మధ్యకాలంలో పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టడం, పెంట్‌అప్‌ (కొంతకాలం నిస్తే జం తర్వాత గిరాకీ ఒక్కసారిగా పెరగడం) డిమాండ్‌ ఇందుకు దోహదపడనున్నాయని వారు భావిస్తున్నారు. కరోనా తీవ్రత కారణంగా గత ఏడాది ధనత్రయోదశి, దీపావళికి బంగారం కొనేవారు కరువయ్యారు. సాధారణంగా పితృపక్షాల నెలలో బంగారం అమ్మకాలు అంతగా ఉండవు. అయితే, తులం పసిడి రూ.42,500 స్థాయికి దిగిరావడంతో ఆ సమయం నుంచే అమ్మకాలు కాస్త పుంజుకున్నాయని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సి ల్‌ చైర్మన్‌ ఆశీష్‌ పీఠ్‌ అన్నారు. గడిచిన కొన్ని నెలల్లో జీఎ్‌సటీ వసూళ్లు గణనీయంగా పెరగడం ఆర్థిక పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతమన్నారు.


వాయిదా పడిన చాలా పెళ్లిళ్లు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయని, ఆభరణ విక్రయాల పెరుగుదలకు ఇది దోహదపడనుందన్నారు. కొనుగోలుదారుల వైఖరి,  మార్కెట్‌ సంకేతాలను బట్టి చూస్తే, ఈ పండగ సీజన్‌లో విక్రయాలు 2019తో పోల్చితే 20-25 శాతం పెరగవచ్చని అంచనా. గత ఏడాది ఆగస్టులో 56,000 దాటిన తులం మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర.. ప్రస్తుతం ముంబై మార్కెట్లో రూ.47,700 స్థాయికి తగ్గింది. 


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు మళ్లీ ఎగబాకే అవకాశాలున్నాయి. దాంతో దేశీయంగానూ ధరలు పెరుగుతాయి. వచ్చే ఏడా ది దీపావళి నాటికి దేశీయంగా తులం మేలిమి బంగారం రేటు రూ.54,000 స్థాయికి పెరగవచ్చని భావిస్తున్నాం.

- ప్రథమేష్‌ మాల్యా, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ విభాగ ఏవీపీ గత దీపావళితో పోల్చితే, ఈ దీపావళికి ధరలు కాస్త తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మేలిమి బంగారం తులం ధర రూ.47,000-49,000 స్థాయిలో కదలాడింది. అయితే, ధరలు మళ్లీ పెరిగేందుకు అధిక అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఏడాదికాలంలో రూ.52,000-53,000 స్థాయికి చేరుకోవచ్చు. 

- మోతీలాల్‌ ఓస్వాల్‌ 


ఈ పండగ సీజన్‌లో 2019తో పోల్చితే అమ్మకాలు 25-30 శాతం వరకు పెరగవచ్చని భావిస్తున్నాం. పెళ్లిళ్ల సీజన్‌ కూడా 3-4 నెలల వరకు కొనసాగనుందని ఆశిస్తున్నాం. మూడో దశ వ్యాప్తి ముప్పు లేకుంటే వచ్చే ఏడాది మార్చి వరకు నగల మార్కెట్‌ కళకళలాడే అవకాశం ఉంది. 

- సౌరభ్‌ గాడ్గిల్‌, పీఎన్‌జీ జువెలర్స్‌ చైర్మన్‌, ఎండీ 


ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ, పెంట్‌అప్‌ డిమాండ్‌ కారణంగా ఈ ధనత్రయోదశి, దీపావళికి బంగారం నగల విక్రయాలు పుంజుకోనున్నాయి. గత దీపావళితో పోల్చితే విక్రయాలు 30-40 శాతం వరకు పెరగవచ్చని భావిస్తున్నాం. 

- అహ్మద్‌ ఎంపీ, మలబార్‌ గోల్డ్‌ చైర్మన్‌ 

Updated Date - 2021-10-31T09:34:53+05:30 IST