హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ కేంద్రం
ABN , First Publish Date - 2021-07-20T05:54:39+05:30 IST
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
- 2023 నాటికి 2,500 మంది ఉద్యోగులు
- ‘బీఎఫ్ఎస్ ఐ’ హబ్‌గా హైదరాబాద్
- మరిన్ని కంపెనీలతో చర్చిస్తున్నాం: కేటీఆర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సలార్‌పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో 1,59,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం కీలకమైన ఇన్నోవేషన్ హబ్‌గా పని చేస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి గుంజన్ సమ్తానీ తెలిపారు. భారత్‌లో ఇంజనీరింగ్, బిజినెస్ ఇన్నోవేషన్ కార్యకలాపాలను విస్తరించే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రం కన్స్యూమర్ బ్యాంకింగ్ సర్వీసెస్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ (ప్లాట్‌ఫామ్స్, పరిశోధన, అభివృద్ధి, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్), ఫైనాన్స్, షేర్డ్ సర్వీసెస్, ఎనలిటిక్స్, రిపోర్టింగ్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ కేంద్రంలో ఇప్పటికే 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 1,300 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 800 మందికి పెంచనున్నారు. ఇందులో 70 శాతం మందిని కొత్తగా తీసుకోనున్నారు. మిగిలిన వారు బెంగళూరు కేంద్రం నుంచి వస్తారు. 2023 నాటికి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగులు 2,500 మందికి చేరగలరని గుంజన్ అన్నారు. ప్రపంచస్థాయి నిపుణుల లభ్యత భారత్‌కు వచ్చే విధంగా గోల్డ్‌మన్ శాక్స్‌ను ఆకర్షించిందని గుంజన్ అన్నారు.
500 మంది అనుకుంటే..
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎస్‌ఐ) పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గడిచిన కొన్నేళ్లుగా బీఎఫ్‌ఎ్‌సఐ రంగంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం దాదాపు 1,80,000 మంది ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఈ కంపెనీల్లో పని చేస్తున్నారు. అంతర్జాతీయ సామర్థ్యాలు కలిగిన వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేయడం తదితర అంశాలు ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిన్నాయి. ఇప్పటికే గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకులకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
గోల్డ్‌మన్ శాక్స్ కేంద్రంతో మరిన్ని కంపెనీల కార్యాలయాలు హైదరాబాద్‌కు వచ్చే వీలుందని మంత్రి వివరించారు. వుయ్ హబ్, టీ-హబ్‌లతో గోల్డ్‌మన్ శాక్స్ కలిసి పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేయడంపై గత ఏడాది గోల్డ్‌మన్ శాక్స్‌తో చర్చలు జరిగాయని, అప్పుడు 500 మంది పని చేసే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గోల్డ్‌మన్ శాక్స్ భావించిందని కేటీఆర్ అన్నారు. అయితే, ఇక్కడ పరిస్థితులు, ప్రోతాహాన్ని పరిశీలించిన తర్వాత 2021 నాటికి 800 మంది, 2023 నాటికి 2,500 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.