పసిడి..ప్చ్!
ABN , First Publish Date - 2021-10-20T08:09:14+05:30 IST
ఈ ఏడాది భారత్లో బంగారం గిరాకీ అంచనాల కంటే నిస్తేజంగా ఉండవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంటోంది.

ఈ ఏడాది గిరాకీ నిస్తేజంగానే..
2022లో పెరగనున్న డిమాండ్.. ప్రపంచ స్వర్ణ మండలి అంచనా
ముంబై: ఈ ఏడాది భారత్లో బంగారం గిరాకీ అంచనాల కంటే నిస్తేజంగా ఉండవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంటోంది. దీర్ఘకాల కరోనా సంక్షోభమే ఇందుకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ, బంగారం దిగుమతులు సమృద్ధిగా కొనసాగనున్నాయని, కొవిడ్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తుండటంతో ఈ పండగ సీజన్లో బంగారం రిటైల్ డిమాండ్ పెరగవచ్చని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. 2022లో మాత్రం పసిడి గిరాకీ జోరందుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధి, ఒక్కసారిగా పెరగనున్న వినియోగం ఇందుకు దోహదపడవచ్చని నివేదిక అంచనా వేసింది. అయితే, దేశంలో కరోనా మరోసారి విజృంభించిన పక్షంలో పసిడి డిమాండ్ మరింత అనిశ్చితిలోకి జారుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నివేదికలోని మరిన్ని విషయాలు..
దేశంలో కుటుంబ ఆదాయాల పెరుగుదల పసిడి డిమాండ్ చోదకాల్లో ప్రధానమైంది. ఆర్థిక వృద్ధి పెరిగితే, ప్రజల ఆదాయం పెరిగి విలువైన లోహాలకూ గిరాకీ పెరుగుతుంది.
కరోనా సంక్షోభ ప్రభావంతో దేశంలో పొదుపు రేటు తగ్గడంతో పాటు వ్యవసాయ రంగంలో వేతనాలు పెరగకపోవడం వంటి అంశాలు భారత్లో బంగా రం గిరాకీకి సవాళ్లుగా మారాయి. దేశంలోని కుటుంబాలు గతంలో కంటే తక్కువగా పొదుపు చేస్తున్నాయి. పొదుపు సొమ్మును బ్యాంక్లు లేదా ఇతర ఆర్థిక పథకాల్లోకి మళ్లించేవారు పెరుగుతుండటమూ పసిడి గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
డబ్ల్యూజీసీ రిపోర్టు ప్రకారం..
తలసరి ఆదాయం ఒక శాతం వృద్ధి చెందితే, పసిడి గిరాకీ 0.9 శాతం పెరుగుతుంది.
ఏడాదిలో బంగారం ధర ఒక శాతం తగ్గితే, గిరాకీ 1.2 శాతం పెరుగుతుంది.
బంగారం రేటు ఒక శాతం పెరిగితే, డిమాండ్ 0.4 శాతం తగ్గుతుంది.
ద్రవ్యోల్బణం ఒక శాతం పెరిగితే, బంగారం
డిమాండ్ 2.6 శాతం పెరుగుతుంది.
గత ఏడాదితో పోల్చితే పసిడి డిమాండ్ మెరుగ్గానే ..
గత ఏడాదితో పోల్చితే, ఈసారి పసిడి డిమాండ్ మెరుగ్గానే ఉండనుంది. అయితే, మార్కెట్లో ట్రెండ్ మిశ్రమంగా ఉంది. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేస్తున్న వారిలో సంపన్న వర్గాలే అధికం. కరోనా సంక్షోభంతో అధికంగా ప్రభా వితమైన అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు బులియన్ మార్కెట్కు ఇంకా దూరంగానే ఉన్నారు.
- సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ, ఇండియా
