అదానీ చేతికి గంగవరం పోర్టు

ABN , First Publish Date - 2021-03-24T08:28:25+05:30 IST

అదానీ చేతికి గంగవరం పోర్టు

అదానీ చేతికి గంగవరం పోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఓడరేవులో పాగా

తాజాగా రూ.3,604 కోట్లకు 

58.1శాతం వాటా కొనుగోలు

 ఆరు నెలల్లో  ప్రక్రియ పూర్తి

89.6 శాతానికి మొత్తం వాటా 

 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు లిమిటెడ్‌లో (జీపీఎల్‌) మెజారిటీ వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎ్‌సఈజెడ్‌) సొంతం చేసుకుంది. జీపీఎల్‌లో 89.6 శాతం వాటా అదానీల చేతికి రానుంది. ఈ నెల 3న ఈ పోర్టులో 31.5 శాతం వాటాను అమెరికా పీఈ కంపెనీ వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్‌ తాజాగా మరో 58.1 శాతం వాటాను సొంతం చేసుకుంటోంది. ప్రమోటర్లు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి ఈ వాటాను రూ.3,604 కోట్లకు కొనుగోలు చేస్తోంది. చట్టపరమైన అన్ని అనుమతుల మేరకు ఈ కొనుగోలు అమలులోకి వస్తుందని ఏపీఎ్‌సఈజెడ్‌ తెలిపింది. ఆరు నెలల్లో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్కో షేరుకు రూ.120 చెల్లించి వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటాను అదానీ పోర్టు కొనుగోలు చేసింది. అదే ధరకు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి 30 కోట్ల షేర్లను (58.1ు) సొంతం చేసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. గంగవరం పోర్టు చెల్లించిన మూలధనం రూ.51.7 కోట్లు. ఇందులో 58.1ు వాటా డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం,  31.5 శాతం వాటా వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో ఉంది. మిగిలిన 10.4ు వాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. 


వ్యూహంలో భాగంగా: పశ్చిమ తీరప్రాంత కంపెనీగానే పరిమితం కాకుండా.. దేశ వ్యాప్త కార్గో యుటిలిటీ కంపెనీగా ఎదగాలని అదానీ పోర్ట్సు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే గంగవరం పోర్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు అదానీల చేతిలో ఉంది. తాజాగా గంగవరం పోర్టు కూడా సొంతం అయింది. ఈ రెండు పోర్టులతో కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది. దాదాపు రూ.12,000 కోట్లకు కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్‌ 75 శాతం వాటాను  కొనుగోలు చేసింది. 2025 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచుకోవాలన్నది అదానీ పోర్ట్సు లక్ష్యం.


64 ఎంఎంటీ సామర్థ్యం: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తీరంలో విశాఖపట్నం పోర్టుకు తర్వాత వ్యూహాత్మకంగా గంగవరం పోర్టు ఉంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నాన్‌- మేజర్‌ పోర్టు. ప్రస్తుతం 9 బెర్త్‌లతో పని చేస్తున్న పోర్టు స్థాపిత సామర్థ్యం 64 ఎంఎంటీ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు). అన్ని వాతావరణ పరిస్థితుల్లో కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతోపాటు డీప్‌ వాటర్‌, మల్టీపర్పస్‌ ఓడరేవు ఇది. 2 లక్షల డెడ్‌వెయిటేజ్‌ టన్నుల (డీడబ్ల్యూటీ) నౌకలు కూడా పోర్టులోకి వచ్చే సదుపాయం ఉంది. 1,800 ఎకరాల స్థలం కలిగిన ఈ పోర్టును 250 ఎంఎంటీపీఏ సామర్థ్యానికి పెంచాలన్నది అసలు ప్రణాళిక. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి. బాక్సైట్‌, చక్కెర, అల్యూమినా, ఉక్కు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. తూర్పు, దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లోని ఎనిమిదికి పైగా రాష్ట్రాలకు ఇది ఇంటర్‌ల్యాండ్‌ గేట్‌ వే పోర్టు కావడం విశేషం.

రుణ రహిత కంపెనీ..: గత ఆర్థిక సంవత్సరం (2019-20) గంగవరం పోర్టు 34.5 మిలియన్‌ టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేసింది. రూ.1,082 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రూ.516 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రుణ రహిత కంపెనీనే కాక.. చేతిలో రూ.500 కోట్లకు పైగా నగదు ఉంది. డీవీఎస్‌ రాజు కుటుంబం గొప్ప పోర్టును అభివృద్ధి చేసిందని.. ఈ పోర్టు సామర్థ్యాన్ని 250 మిలియన్‌ టన్నులకు పెంచుకోవడానికి వీలుందని ఏపీఎ్‌సఈజెడ్‌ సీఈఓ కరణ్‌ అదానీ అన్నారు. నెట్‌వర్క్‌ విస్తరణ వ్యూహంలో భాగంగా గంగవరం పోర్టును సొంతం చేసుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-03-24T08:28:25+05:30 IST