కరోనా తర్వాత... ఇప్పుడిప్పుడే జోరందుకుంటోన్న విమాన ప్రయాణాలు

ABN , First Publish Date - 2021-12-20T02:30:59+05:30 IST

కరోనా మహమ్మారి నేపధ్యంలో గత రెండేళ్ళుగా దారుణంగా తగ్గిపోయిన విమాన ప్రయాణాలు... ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి.

కరోనా తర్వాత... ఇప్పుడిప్పుడే జోరందుకుంటోన్న విమాన ప్రయాణాలు

ముంబై : కరోనా మహమ్మారి నేపధ్యంలో గత రెండేళ్ళుగా దారుణంగా తగ్గిపోయిన విమాన ప్రయాణాలు... ఇప్పుడిప్పుడే  పుంజుకుంటున్నాయి. పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) నవంబరు నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. అక్టోబరుతో పోలిస్తే నవంబరు నెలలో విమాన ప్రయాణాలు భారీగా పెరిగాయి. అక్టోబరు నెలలో 89.85 లక్షల మంది విమాన ప్రయాణాలు చేయగా, నవంబరులో 1.05 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. అంటే అక్టోబరుతో పోలిస్తే నవంబరు నెలలో ప్రయాణికుల రద్దీ 17.03 శాతం పెరిగినట్టు డీజీసీఏ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


ఇక విమాన ప్రయాణాల కోసం ఎక్కువ మంది ప్రయాణికులు ఇండిగోను ఎంచుకున్నారు. నవంబరు నెలలో మొత్తంగా 1.05 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేయగా, వారిలో 57.06 లక్షల మంది  ఇండిగోలోనే ప్రయాణించారు. దేశీయ పౌర విమానయాన మార్కెట్‌లో  ఈ సంస్థ 54.3 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఇక... 10.78 లక్షల మంది ప్రయాణికులు(10.3 శాతం మార్కెట్‌ వాటా) స్పైస్‌జెట్‌‌లో ప్రయాణించారు. ఎయిరిండియా 9.98 లక్షల మంది, గోఫస్ట్‌ 11.56 లక్షల మంది, విస్తారా 7.93 లక్షల మంది, ఎ యిర్‌ఏషియా ఇండియా 6.23 లక్షల మంది, అలియన్స్‌ ఎయిర్‌‌లో 1.23 లక్షల మంది ప్రయాణించారు. 

Updated Date - 2021-12-20T02:30:59+05:30 IST