ఈ ఏడాది రెండంకెల వృద్ధి రేటు

ABN , First Publish Date - 2021-07-12T07:35:18+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) జీడీపీ వృద్ధి రేటుపై నీతి ఆయోగ్‌ అత్యంత ఆశాభావంతో ఉంది.

ఈ ఏడాది రెండంకెల వృద్ధి రేటు

ప్రైవేటీకరణకూ ఢోకా ఉండదు 

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ 


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) జీడీపీ వృద్ధి రేటుపై నీతి ఆయోగ్‌ అత్యంత ఆశాభావంతో ఉంది. గత ఏడాది మైనస్‌ 7.3 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు ఈ సంవత్సరం రెండంకెల్లో ఉంటుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థలు ఎస్‌ అండ్‌ పీ, ఫిచ్‌ కూడా ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సర భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 10 శాతం దిగువకు కుదించాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ వృద్ధి రేటు రెండంకెల్లో ఉంటుందని చెప్పడం విశేషం. కొవిడ్‌ మూడో ఉధృతి వచ్చినా పెద్దగా భయపడాల్సింది లేదని రాజీవ్‌ కుమార్‌ అన్నారు. రెండు ఉధృతుల అనుభవంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మూడో ఉధృతిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

పెట్టుబడుల ఉపసంహరణ: స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ రన్‌లో ఉన్నందున 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్య సాధన పెద్ద కష్టం కాకపోవచ్చని రాజీవ్‌ అన్నారు. ఆర్థిక భవిష్యత్‌ బాగుండబట్టే స్టార్టప్‌ కంపెనీలు కూడా ప్రస్తుతం పబ్లిక్‌ ఇష్యూల బాట పట్టాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ (ఎఫ్‌డీఐ) పెద్ద ఎత్తున దేశంలోకి వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోందన్న భయాల్ని రాజీవ్‌ తోసిపుచ్చారు. ప్రస్తుత ధరల పెరుగుదల తాత్కాలికమన్నారు. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన నాలుగు శాతానికి అటుఇటుగా రెండు శాతం మించదన్నారు.


కొవిడ్‌ బాండ్స్‌: కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని రాజీవ్‌ అన్నారు. ఇది ద్రవ్య లోటు గురించి ఆలోచించే సమయం కాదన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వం కొవిడ్‌ బాండ్స్‌ తీసుకువచ్చే  అవకాశాలను పరిశీలిస్తోందన్నారు.   


ఇక దూకుడే: సీఐఐ సర్వే

భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా కోలుకుంటోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సర్వేలో ప్రధాన కంపెనీల సీఈఓలు వెల్లడించారు. ఈ సర్వే కోసం సీఐఐ ప్రతినిధులు.. 119 ప్రధాన కంపెనీల సీఈఓలతో మాట్లాడారు. వీరిలో 60 శాతం మంది కొవిడ్‌ తొలి ఉధృతితో పోలిస్తే రెండో ఉధృతిలో తమ అమ్మకాలు బాగున్నాయన్నారు. లాక్‌డౌన్లు ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ కంటే సామాజిక నియంత్రణలపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణమని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. ఎగుమతులపైనా కొవిడ్‌ రెండో ఉధృతి ప్రభావం పెద్దగా లేదని సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-07-12T07:35:18+05:30 IST