టెల్కోలకు ‘సుప్రీం’లో చుక్కెదురు
ABN , First Publish Date - 2021-07-24T07:00:11+05:30 IST
సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు మరోసారి చుక్కెదురైంది.

- ఏజీఆర్ తిరిగి లెక్కించేందుకు నో
- వొడాఫోన్, ఐడియాలపైనే అధిక భారం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు మరోసారి చుక్కెదురైంది. రూ.93,520 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపు కేసులో గతంలో తాము ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించే అవకాశం లేదని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోనిని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ బకాయిలను లెక్క కట్టడంలో తప్పులు దొర్లాయన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ కంపెనీల వాదనను తోసిపుచ్చింది. కంపెనీల వాదనలో ఏ మాత్రం పస లేదని స్పష్టం చేసింది. దీనిపై గత ఏడాది సెప్టెబరులో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. టెలికాం శాఖ (డాట్) కోరిన విధంగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో వొడాఫోన్ ఐడియా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.