రిలయన్స్-ఫ్యూచర్ డీల్: ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపై స్టే!

ABN , First Publish Date - 2021-03-22T20:04:27+05:30 IST

రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ డీల్ విషయంలో అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు ఉన్నత ధర్మాసనం షాకిచ్చింది.

రిలయన్స్-ఫ్యూచర్ డీల్: ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపై స్టే!

రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ డీల్ విషయంలో అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు ఉన్నత ధర్మాసనం షాకిచ్చింది. రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన అదేశాలపై స్టే విధించింది. అలాగే ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈవో కిశోర్ బియానీ సహా ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌న్న ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.


ఫ్యూచర్‌ గ్రూప్‌‌నకు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉండడంతో 3 నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది రూ. 24,713 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు తనకు దఖలు పడిన నేపథ్యంలో.. రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమెజాన్‌ సంస్థ సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో సవాల్‌ చేసింది. కేసును విచారించిన సింగపూర్ కోర్టు రిలయన్స్‌తో డీల్‌పై స్టే విధించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

Updated Date - 2021-03-22T20:04:27+05:30 IST