ఐఓసీకి కలిసొచ్చిన మార్జిన్లు

ABN , First Publish Date - 2021-05-20T05:44:40+05:30 IST

ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నాలుగో త్రైమాసికం లాభం మార్కెట్‌ అంచనాలను మించింది

ఐఓసీకి కలిసొచ్చిన మార్జిన్లు

నాలుగో త్రైమాసికం లాభం రూ.8781 కోట్లు

 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నాలుగో త్రైమాసికం లాభం మార్కెట్‌ అంచనాలను మించింది. అధిక క్రూడ్‌ ధరలతో ఇన్వెంటరీ విలువ పెరగడం, తద్వారా లభించిన అధిక రిఫైనింగ్‌ మార్జిన్లు ఇందుకు కారణమని ఐఓసీ చైర్మన్‌ ఎస్‌.ఎం.వైద్య తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఐఓసీ రూ.8781.30 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంటే ఒక్కో షేరుపై ఆర్జించిన లాభం రూ.9.56 ఉంది. ఇన్వెంటరీ నష్టాల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.5185.32 కోట్ల నష్టం నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 23 శాతం పెరిగాయని ఆయన చెప్పారు.


దీంతో ప్రతీ ఒక్క బ్యారెల్‌ క్రూడాయిల్‌ శుద్ధిపై కంపెనీ 10.6 డాలర్లు ఆర్జించిందని ఆయన అన్నారు. ఈ ఇన్వెంటరీ లాభాలు లేకపోయి ఉంటే ఒక్కో బ్యారెల్‌పై తాము 2.51 డాలర్లు మాత్రమే ఆర్జించి ఉండేవారమని చెప్పారు. మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తంలో రికార్డు స్థాయిలో రూ.21,836 కోట్ల నికరలాభం ఆర్జించినట్టు వైద్య తెలిపారు. ముందు ఏడాదితో పోల్చితే ఆదాయం నూ.5,66,354 కోట్ల నుంచి రూ.5,14,890 కోట్లకు తగ్గిందని ఆయన చెప్పారు. ప్రస్తుత కరోనా ఉదృతి కారణంగా ఇంధన డిమాండు తగ్గినప్పటికీ గత ఏడాది జరిగినంత స్థాయిలో లేదని ఆయన అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇంధన డిమాండు 49 శాతం క్షీణించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అది 15-20 శాతం ఉన్నట్టు ఆయన చెప్పారు. రిఫైనరీలు ఏప్రిల్‌లో 96.1 శాతం, మే నెలలో ఇప్పటివరకు 84 శాతం సామర్థ్యంతో పని చేశాయని ఆయన చెప్పారు. 


డివిడెండు : ఒక్కో ఈక్విటీ షేరుపై కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.1.50 తుది డివిడెండును ప్రకటించింది. 

Updated Date - 2021-05-20T05:44:40+05:30 IST