కన్నాట్‌ ప్లేస్‌.. కాస్ట్‌లీ గురూ!

ABN , First Publish Date - 2021-12-15T09:17:23+05:30 IST

కన్నాట్‌ ప్లేస్‌.. కాస్ట్‌లీ గురూ!

కన్నాట్‌ ప్లేస్‌.. కాస్ట్‌లీ గురూ!

 అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లలో 17వ స్థానం 

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కె ట్లలో ఢిల్లీకి చెందిన కన్నాట్‌ ప్లేస్‌ 17వ స్థానంలో ఉంది. గత ఏడాది 25వ స్థానంలో నిలిచిన ఈ ప్రాంతం ఈసారి 8 స్థానాలు ఎగబాకిందని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ జేఎల్‌ఎల్‌ తాజా నివేదిక వెల్లడించింది. కన్నాట్‌ ప్లేస్‌ ఆఫీస్‌ మార్కెట్లో చదరపు అడుగు వార్షిక అద్దె సగటు 109 డాలర్లు (రూ.8,175)గా నమోదైందని పేర్కొంది. న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్‌, హాంకాంగ్‌లోని సెంట్రల్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లుగా అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. ఈ మార్కెట్లలో చదరపు అడుగు వార్షిక అద్దె సగటు 261 డాలర్ల్ల (రూ.19,575) స్థాయిలో ఉందని జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. బీజింగ్‌లోని ఫైనాన్స్‌ స్ట్రీట్‌, లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌తో పాటు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ టాప్‌-5లో నిలిచాయి. భారత్‌ విషయానికొస్తే, కన్నాట్‌ ప్లేస్‌ దేశంలోనే అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌గా నిలవగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) రెండో అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ చదరపు అడుగు వార్షిక అద్దె సగటు 102 డాలర్లుగా (రూ.7,650) నమోదైంది. ప్రపంచ జాబితాలో ఒక మెట్టు కిందికి జారి 23వ స్థానానికి పరిమితమైంది. ముంబైలోని సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (58 డాలర్లు)కు లిస్ట్‌లో 63వ స్థానం లభించింది. 51 డాలర్ల వార్షిక అద్దె సగటుతో బెంగళూరు 77వ స్థానంలో ఉంది.

 గత ఏడాదితో పోలిస్తే 3 స్థానాలు జారుకుంది. గురుగ్రామ్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో చదరపు అడుగు వాణిజ్య స్థల అద్దె వార్షిక సగటు 44 డాలర్లకు తగ్గింది. దాంతో జాబితాలో 91 స్థానానికి పడిపోయింది. చెన్నై 21 డాలర్ల అద్దె సగటుతో ప్రపంచంలోనే అత్యంత చౌక ఆఫీస్‌ మార్కెట్లలో నాలుగో స్థానంలో ఉంది. 

Updated Date - 2021-12-15T09:17:23+05:30 IST