తెలుగు రాష్ట్రాల్లో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ అభివృద్ధి.. బరిలో మేఘా ఇంజనీరింగ్
ABN , First Publish Date - 2021-12-24T07:58:50+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) పోటీపడుతోంది...
- ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, ప్రకాశం
- తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) పోటీపడుతోంది. పదకొండో విడత బిడ్డింగ్‌లో భాగంగా దేశంలోని 65 ప్రాంతాల్లో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ అభివృద్ధికి లైసెన్సులు మంజూరు చేసేందుకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) బిడ్డింగ్ నిర్వహించింది. లైసెన్సులు మంజూరు చేయనున్న ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాలు కూడా ఉన్నాయి. పీఎన్‌జీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 65లో 61 ప్రాంతాల లైసెన్సుల కోసం టెక్నికల్ బిడ్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), అదానీ టోటల్ గ్యాస్ టాప్ బిడ్డర్లుగా నిలిచాయి. 61లో 53 ప్రాంతాల లైసెన్సుల కోసం ఐఓసీ బిడ్లు సమర్పించగా.. అదానీ టోటల్ 52 ప్రాంతాల లైసెన్సుల కోసం పోటీపడింది. ఎంఈఐఎల్ 43 లైసెన్సుల కోసం పోటీ పడుతోంది. గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల లైసెన్సుల కోసం మేఘా ఇంజనీరింగ్, అదానీ టోటల్ గ్యాస్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సహా మరిన్ని కంపెనీలు టెక్నికల్ బిడ్లు సమర్పించాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, కామరెడ్డి జిల్లాల్లో సిటీ గ్యాస్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం మేఘా ఇంజనీరింగ్, ఐఓసీ, అదానీ టోటల్ గ్యాస్, బీపీసీఎల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు బిడ్ వేశాయి.
ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలుకూ పోటీలో..
ప్రభుత్వ రంగ సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలుకు ఆసక్తి కలిగిన వర్గాలు ఫైనాన్షియల్ బిడ్లను సమర్పించాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. బిడ్లు సమర్పించిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్)తోపాటు టాటా స్టీల్, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్, జేఎ్‌సపీఎల్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, భెల్, మెకాన్‌తోపాటు ఒడిశా ప్రభుత్వ సంస్థలైన ఓఎంసీ, ఐపీఐసీఓఎల్ సంయుక్త భాగస్వామ్యంలో ఎన్‌ఐఎన్‌ఎల్ ఏర్పాటైంది. ఈ కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ గత ఏడాది జనవరిలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.