5జీ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-05-05T07:02:00+05:30 IST
ఐదో తరం (5జీ) టెలికాం సేవలకు దేశం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రయోగాత్మక పరీక్ష (ట్రయల్స్)లకు టెలికాం శాఖ (డాట్) ఆమోదం తెలిపింది...

- చైనా టెక్నాలజీ మాత్రం వద్దే వద్దు
న్యూఢిల్లీ: ఐదో తరం (5జీ) టెలికాం సేవలకు దేశం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రయోగాత్మక పరీక్ష (ట్రయల్స్)లకు టెలికాం శాఖ (డాట్) ఆమోదం తెలిపింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, ఎంటీఎన్ఎల్ కంపెనీలకు ఈ మేరకు అనుమతి లభించింది. కంపెనీలు ఈ ప్రయోగాత్మక పరీక్షల ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయాలని డాట్ కోరింది. ఇందుకు అవసరమైన స్రెక్ట్రమ్ బ్యాండ్‌లనూ ప్రకటించింది.
చైనా కంపెనీలకు నో
ఊహించినట్టే హువే వంటి చైనా టెలికాం యంత్రాల (గేర్) తయారీ కంపెనీలకు ప్రభుత్వం షాకిచ్చింది. 5జీ పరీక్షల కోసం టెలికాం ఆపరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో చైనా కంపెనీల టెలికాం గేర్ వాడకూడదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి భారత 5జీ టెలికాం సేవల మార్కెట్లో చైనా కంపెనీలకు స్థానం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీతో పాటు రిలయన్స్ జియో సొంతంగా అభివృద్ధి చేసిన 5జీ టెక్నాలజీ మాత్రమే ఈ ప్రయోగాత్మక పరీక్షల కోసం ఉపయోగించాలని డాట్ కోరింది.
త్వరలో బీఎస్ఎన్ఎల్ దరఖాస్తు
ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటి వరకు 5జీ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేయలేదు. ఈ కంపెనీ కూడా త్వరలోనే ఇందుకోసం దరఖాస్తు చేస్తుందని భావిస్తున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. ‘బీఎస్ఎన్ఎల్ 5జీ ప్రయోగాత్మక పరీక్షలు విడిగా నిర్వహిస్తుంది. ఇందుకోసం వారి నుంచి త్వరలోనే దరఖాస్తు అందుతుందని భావిస్తున్నాం’ అని టెలికాం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్ చెప్పారు. ఈ నాలుగు కంపెనీలు 5జీ ట్రయల్స్‌ను పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లోనూ నిర్వహించాలని డాట్ స్పష్టం చేసింది. అలాగే ఈ పరీక్షల వివరాలను (డేటా) దేశంలోనే స్టోర్ చేయాలని కూడా స్పష్టం చేసింది.