బీమా కంపెనీలకు రూ.3,000 కోట్లు

ABN , First Publish Date - 2021-02-15T07:27:23+05:30 IST

ప్రభుత్వ రంగంలోని మూడు సాధారణ బీమా కంపెనీలను ఆర్థికంగా మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగా ఏప్రిల్‌లోగా ఈ కంపెనీలకు రూ.3,000 కోట్ల మూలధన సాయం చేయబోతోంది. ఈ ఆర్థిక పటిష్ఠీకరణలో భాగంగా నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అధీకృత ఈక్విటీ

బీమా కంపెనీలకు రూ.3,000 కోట్లు

  • మూలధనాన్ని అందించనున్న ప్రభుత్వం 


న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని మూడు సాధారణ బీమా కంపెనీలను ఆర్థికంగా మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగా ఏప్రిల్‌లోగా ఈ కంపెనీలకు రూ.3,000 కోట్ల మూలధన సాయం చేయబోతోంది. ఈ ఆర్థిక పటిష్ఠీకరణలో భాగంగా నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అధీకృత ఈక్విటీ మూలధనాన్ని రూ.7,500 కోట్లకు, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీఎల్‌), ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఓఐసీఎల్‌) మూలధనాన్ని రూ.5,000 కోట్లకు పెంచుతారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ గత ఏడాదే ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవ్సత్సరం (2021 -22) ఈ మూడు కంపెనీల్లో ఒక కంపెనీని ప్రైవేటీకరించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించారు. 


రూ.18,488 కోట్ల ప్రీమియం

బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు క్రమంగా గాడిన పడుతున్నాయి. జనవరి నెలలో నాన్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు నేరుగా రూ.18,488,06 కోట్ల స్థూల ప్రీమి యం వసూలు చేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6.7 శాతం ఎక్కువని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) తెలిపింది. కాగా జనవరి నెల ప్రీమియం వసూళ్లలో రూ.16,247.24 కోట్ల మొత్తాన్ని 25 జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు సాఽధించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.8 శాతం ఎక్కువ.


11 నెలల్లో రూ.1,63,670.13 కోట్లు 

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు చూసినా అన్ని బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.1,63,670.13 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 2.76 శాతం ఎక్కువ. ఇందులో సాధారణ బీమా కంపెనీల వాటా రూ.1,40,999.04 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది కేవలం 1.9 శాతం మాత్రమే ఎక్కువ.  


అందుబాటులోకి డిజిలాకర్‌

పాలసీదారుల సేవలను మరింత పటిష్ఠం చేయాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలసీదారులకు డిజిలాకర్‌ సదుపాయం కల్పించాలని కోరింది. ఇలా చేయడం వల్ల మోసాలను అరికట్టడంతో పాటు, సెటిల్‌మెంట్లు  త్వరగా చేయవచ్చని పేర్కొంది. పాలసీ ఇచ్చేటప్పుడే బీమా కంపెనీలు డిజిలాకర్‌ గురించి పాలసీదారులకు అవగాహన కల్పించాలని కోరింది. 

Updated Date - 2021-02-15T07:27:23+05:30 IST