రఘు వంశీకి బోయింగ్ కాంట్రాక్ట్
ABN , First Publish Date - 2021-08-03T06:02:45+05:30 IST
బోయింగ్ కంపెనీ నుంచి హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ కంపెనీ కాంట్రాక్టు

- ఆదిభట్లలో రూ.110 కోట్లతో తయారీ యూనిట్..
- 300 మందికి ఉపాధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బోయింగ్ కంపెనీ నుంచి హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ కంపెనీ కాంట్రాక్టు పొందింది. ప్రెసిషన్ పరికరాలను తయారు చేసి సరఫరా చేయడానికి ఈ కాంట్రాక్టు పొందినట్లు రఘు వంశీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ గణేసుల తెలిపారు. బోయింగ్‌కు అవసరమైన పరికరాలను సరఫరా చేయడానికి దాదాపు రూ.110 కోట్లతో ఆదిభట్లలో ప్రత్యేకంగా తయారీ యూనిట్‌ను రఘు వంశీ ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా వచ్చే మూడేళ్లలో 300 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది.
రఘు వంశీ కంపెనీకి మాత్రమే కాక.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమకు, రాష్ట్రానికి ఈ కాంట్రాక్టు ఒక మైలురాయని వంశీ వికాస్ అన్నా రు. ప్రెసిషన్ పరికరాల తయారీ, సరఫరాలో కంపెనీ సామర్థ్యాలకు బోయింగ్ కాంట్రాక్టు ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌లో ఇది ఒక కీలక మలుపని బోయింగ్ ఇండియా సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అశ్వనీ భార్గవ తెలిపారు. భారత్‌లో ఏరోస్పేస్, రక్షణ రంగంలో సామర్థ్యాలను పెంచడానికి బోయింగ్ అండగా నిలుస్తోందని చెప్పారు. అత్యాధునిక ప్రెసిషన్ విడి భాగాలను తయారు చేసి దేశ,విదేశాల్లోని ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలోని ఖాతాదారులకు రఘు వంశీ అందిస్తోంది.