వచ్చే నెలలో మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు
ABN , First Publish Date - 2021-11-26T09:26:23+05:30 IST
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ... వచ్చే ఆరు నెలల్లో భారత మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ... వచ్చే ఆరు నెలల్లో భారత మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత మూడు నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ను మూడు నెలల్లో, తొలి సెడాన్ ఎలక్ట్రిక్ కారును ఆరు నెలల్లో తీసుకురావాలని చూస్తున్నట్లు బీఎండబ్ల్యూ పేర్కొంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్‌ను రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో తీసుకువస్తున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందన్నారు.
ఈ కారుతో పాటు హోం చార్జింగ్ కిట్‌ను అందించన్నుట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్షిప్ కేంద్రాల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయటంతో పాటు చార్జింగ్ సదుపాయాల కోసం ఇంధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. కాగా ఈ నెలలోనే యూరప్, అమెరికా మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు విక్రమ్ చెప్పారు.