బేర్‌ బిగిపట్టు.. రూ.8 లక్షల కోట్లు ఫట్‌

ABN , First Publish Date - 2021-11-23T08:23:47+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు బిగించింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఏడు నెలలకు పైగా కాలం తర్వాత అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ..

బేర్‌ బిగిపట్టు.. రూ.8 లక్షల కోట్లు ఫట్‌

సెన్సెక్స్‌ 1,170 పాయింట్లు డౌన్‌   

17,500 దిగువ స్థాయికి నిఫ్టీ 

 7 నెలల్లో అతిపెద్ద పతనం

మరో 13ు నష్టపోయిన పేటీఎం 

 రిలయన్స్‌ షేరు 4ు పైగా క్షీణత

 చితికిన చిన్న కంపెనీల షేర్లు 


ముంబై: స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు బిగించింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఏడు నెలలకు పైగా కాలం తర్వాత అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించడంతో మోదీ ప్రభుత్వ సంస్కరణలపై అనిశ్చితి నెలకొనడంతోపాటు పేటీఎం పేలవ లిస్టింగ్‌.. ట్రేడింగ్‌ సెంటిమెంట్‌కు భారీగా గండికొట్టాయి. ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,170.12 పాయింట్లు (1.96 శాతం) పతనమై 58,465.89 వద్దకు జారుకుంది. సూచీకి రెండు నెలలకు పైగా కనిష్ఠ ముగింపు స్థాయి ఇది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్‌ 12 తర్వాత అతిపెద్ద ఒక్కరోజు పతనమిది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ విషయానికొస్తే, 348.25 పాయింట్ల (1.96 శాతం) నష్టంతో 17,416.55 వద్ద క్లోజైంది.  సెప్టెంబరు 20 తర్వాత సూచీకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. అంతేకాదు, ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. 


30లో 27 నష్టాల్లోనే.. 

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో మూడు మినహా మిగతావన్నీ నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 5.74 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. మార్కెట్‌ దిగ్గజ షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి. ఎన్‌టీపీసీ, టైటాన్‌, ఎస్‌బీఐ, కోటక్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, బజాజ్‌ ఆటో షేర్లు 3 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు మాత్రం లాభపడ్డాయి. 


స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లపై అధిక ఒత్తిడి 

బ్లూచిప్‌ కంపెనీలతో పోలిస్తే.. చిన్న, మధ్య స్థాయి షేర్లలో అమ్మ కాల ఒత్తిడి అధికమైంది. దాంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 2.96 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.62 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే, బీఎస్‌ఈలోని రియల్టీ, ఎనర్జీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫైనాన్స్‌ సూచీలు 4.45 శాతం వరకు క్షీణించాయి. టెలికాం, మెటల్‌ సూచీలు మాత్రం లాభపడ్డాయి. 


రూ.261 లక్షల కోట్లకు తగ్గిన మార్కెట్‌ సంపద 

దలాల్‌ స్ట్రీట్‌లో కొనసాగిన అమ్మకాల హోరులో రూ.8.21 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైంది. దాంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.260.98 లక్షల కోట్లకు పడి పోయింది. 


మెడ్‌ప్లస్‌ ఐపీఓకుసెబీ ఓకే 

హైదరాబాద్‌కు చెందిన రిటైల్‌ ఫార్మసీ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) దరఖాస్తుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,639 కోట్ల వరకు సేకరించాలని భావిస్తోంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.600 కోట్లు తాజా ఈక్విటీ జారీ చేయనుండటంతో పాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.1,038.71 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. కంపెనీ వాటాదారుల్లో లోన్‌ ఫర్రో ఇన్వె్‌స్టమెంట్స్‌ రూ.450 కోట్లు, పీఐ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ -1 రూ.500 కోట్లు, ఇతరులు రూ.88.71 కోట్ల విలువైన షేర్లను ఓఎ్‌ఫఎస్‌ పద్ధతిన అమ్మకానికి పెట్టనున్నారు. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధులను కంపెనీ తన అనుబంధ విభాగమైన ఆప్టివల్‌ నిర్వహణ మూలధన అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. మెడ్‌ప్ల్‌సతోపాటు మరో 5 కంపెనీల ఐపీఓలకూ సెబీ అంగీకారం తెలిపింది. ఈ జాబితాలో రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌, ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్‌, ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌, ట్రాక్సాన్‌ టెక్నాలజీస్‌, పురాణిక్‌ బిల్డర్స్‌ ఉన్నాయి. కాగా, స్పెషాలిటీ కోటింగ్‌ ఎమల్షన్స్‌ తయారీ సంస్థ జేసన్‌ ఇండస్ట్రీ ఐపీఓకు వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేసుకుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.900 కోట్లు సేకరించాలనుకుంటోంది. 


గో కలర్స్‌ ఇష్యూకు  135 రెట్ల బిడ్లు 

గో కలర్స్‌ బ్రాండ్‌నేమ్‌తో మహిళా వస్త్రాల రిటైల్‌ విక్రయ స్టోర్లను నిర్వహిస్తోన్న గో ఫ్యాషన్‌ లిమిటెడ్‌ ఐపీఓకు 135.46 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. రూ.1,013.6 కోట్ల సేకరణ లక్ష్యంతో కంపెనీ 80,79,491 షేర్లను ఐపీఓలో విక్రయానికి పెట్టగా.. మొత్తం 109,44,34,026 షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి.  


ఆర్‌ఐఎల్‌కు రూ.69,000 కోట్ల గండి 

చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంలో 20 శాతం వాటాను 1,500 కోట్ల డాలర్లకు విక్రయించేందుకు సౌదీ అరామ్కోతో గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం ఆర్‌ఐఎల్‌ షేరు ఏకంగా 4.42 శాతం క్షీణించి రూ.2,363.40 వద్దకు జారుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.69,364.46 కోట్లు తగ్గి రూ.14,99,185.71 కోట్లకు పడిపోయింది. 


రెండ్రోజుల్లో పేటీఎం 40% పతనం

రూ.51,000 కోట్లు తగ్గిన కంపెనీ మార్కెట్‌ విలువ 

దేశంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం.. మాతృసంస్థ వన్‌97 కమ్యూ నికేషన్స్‌ లిమిటెడ్‌ ఐపీఓలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మరింత గండిపడింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన రోజే (18వ తేదీ) ఏకంగా 27 శాతం క్షీణించిన కంపెనీ షేరు.. సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో మరో 14 శాతం పతనమైంది. సోమవారం బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు 13.03 శాతం నష్టంతో రూ.1,360.30 వద్దకు జారుకుంది. ఈ రెండ్రోజుల్లో కంపెనీ షేరు 40 శాతం పైగా క్షీణించడంతోపాటు రూ.51,000 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఈ కంపెనీ షేరు మున్ముందు మరింత తగ్గి రూ.1,200 స్థాయికి (ఐపీఓలో షేరు విక్రయ ధర రూ.2,150తో పోలిస్తే 44.2 శాతం తగ్గుదల) జారుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మాక్వెరీ రీసెర్చ్‌ అంటోంది. 

Updated Date - 2021-11-23T08:23:47+05:30 IST