దివాలా చట్ట సవరణలు సబబే: సుప్రీం కోర్టు
ABN , First Publish Date - 2021-01-20T09:00:37+05:30 IST
రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యల కోసం గత ఏడాది దివాలా చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణలను సుప్రీం కోర్టు సమర్ధించింది.

న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యల కోసం గత ఏడాది దివాలా చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణలను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ విషయంలో శాసన వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించలేమని స్పష్టం చేసింది. ఎవరైనా బిల్డర్ ఒప్పందం ప్రకారం తన బాధ్యత నెరవేర్చకపోతే ఆ ప్రాజెక్టులో ఇల్లు లేదా ఫ్లాటు కొన్న ఒక వ్యక్తి అయినా దివాలా ప్రక్రియ చేపట్టేందుకు ఇంతకు ముందు అవకాశం ఉండేది. దీన్ని కొనుగోలుదార్లలో వంద మంది లేదా కేటాయింపులు పొందిన వారిలో కనీసం పది శాతానికి పెంచుతూ గత ఏడాది పార్లమెంట్ సవరణలు ఆమోదించింది. రియల్ ఎస్టేట్ లాబీకి లొంగిపోయి ఈ సవరణలు చేశారన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తికి కూడా బిల్డర్లపై దివాలా ప్రక్రియ చేపట్టే హక్కు ఉంటే, అది దుష్పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంది.