అంబానీ, అదానీ ఢీ?

ABN , First Publish Date - 2021-07-08T07:08:41+05:30 IST

ఇద్దరూ గుజరాతీ పారిశ్రామికవేత్తలే. ప్రధాని మోదీకి సన్నిహితులే. దేశీ కుబేరుల్లో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న వీరి మధ్య ఇప్పటి వరకు ఏ వ్యాపారంలోనూ పోటీలేదు.

అంబానీ, అదానీ ఢీ?

సౌర విద్యుత్‌పై ఆధిపత్య పోరాటం

న్యూఢిల్లీ: ఇద్దరూ గుజరాతీ పారిశ్రామికవేత్తలే.  ప్రధాని మోదీకి సన్నిహితులే.  దేశీ కుబేరుల్లో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న వీరి మధ్య ఇప్పటి వరకు ఏ వ్యాపారంలోనూ పోటీలేదు. ఇపుడు వీరిద్దరూ సౌర విద్యుత్‌ రంగంపై ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. వారే ముకేశ్‌ అంబానీ (రిలయన్స్‌).  గౌతం అదానీ (అదానీ గ్రూప్‌. ఈ పోటీతో  సౌర విద్యుత్‌ ధరలు సామాన్యునికి అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం అంబానీ రిఫైనరీ, పెట్రో కమికల్స్‌, టెక్స్‌టైల్స్‌, రిటైల్‌, టెలికం రంగాల్లో ఉంటే, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ఓడ రేవులు, విమానాశ్రయాలు, వంట నూనెలు, కోల్‌ (బొగ్గు) వ్యాపారంలో అదానీ ఉన్నారు. 


సౌర విద్యుత్‌ అవకాశాలు: బొగ్గు, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాలతో ఉత్పత్తి చేసే విద్యుత్‌తో పర్యావరణం దెబ్బ తింటోంది. వీటి దిగుమతులూ ప్రభుత్వ ఖజానాకు భారంగా మారాయి. దీంతో 2030 కల్లా దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 4.5 లక్షల మెగావాట్లకు పెంచాలని  మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇపుడున్న సామర్ధ్యంతో పోలిస్తే ఇది  నాలుగు రెట్లు ఎక్కువ. దీంతో వచ్చే తొమ్మిదేళ్లలో 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.74,000 కోట్లు) పెట్టుబడులతో దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన రిలయన్స్‌ ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు మేమూ ఏటా 5,000 మెగావాట్ల చొప్పున వచ్చే పదేళ్లలో 50,000 మెగావాట్ల అదనపు సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేస్తామని అదానీ ప్రకటించారు. 


తగ్గనున్న టారి్‌ఫలు: సౌర విద్యుత్‌ టారి్‌ఫలు ఇప్పటికే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కంటే తక్కువకు వచ్చాయి. ఇటీవల గుజరాత్‌లో ఒక సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కోసం జరిగిన వేలంలో ఒక కంపెనీ కిలోవాట్‌ అవర్‌కు రూ.2 కంటే తక్కువ ధర కోట్‌ చేసింది. అంబానీ-అదానీల పోటీతో 2030 నాటికి ఇది రూపాయికి దిగి వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. టెలికాం రంగంలో రిలయన్స్‌ ట్రాక్‌ రికార్డే ఇందుకు ఉదాహరణ. రిలయన్స్‌ జియో చౌక టారి్‌ఫల దెబ్బకు తట్టుకోలేక కొన్ని టెలికం కంపెనీలు దుకాణాలు మూసుకోగా, కొన్ని విలీనాలతో కాల గర్భంలో కలిసిపోయాయి. ఇలా విలీనమైన వొడాఫోన్‌ ఐడియా ఇంకా ఆర్థిక కష్టాలతో ఐసీయూలో ఉంది. అంబానీ-అదానీల ప్రవేశాలతో సౌర విద్యుత్‌ రంగంలోనూ ఈ పరిస్థితి తప్పక పోవచ్చని భావిస్తున్నారు.



Updated Date - 2021-07-08T07:08:41+05:30 IST