74 లక్షల ఉద్యోగాలు గల్లంతు

ABN , First Publish Date - 2021-05-14T05:26:26+05:30 IST

గత నెల (ఏప్రిల్‌)లో 73.5 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఈఐ) తెలిపింది. దేశంలో నిరుద్యోగ రేటు మార్చి లో..

74 లక్షల ఉద్యోగాలు గల్లంతు

అందులో 60 లక్షలు ‘అగ్రి’ రంగానివే.. 

ఏప్రిల్‌లో 8 శాతానికి నిరుద్యోగ రేటు

లాక్‌డౌన్‌లతో తగ్గిన ఎల్‌పీఆర్‌: సీఎంఐఈ 


న్యూఢిల్లీ: గత నెల (ఏప్రిల్‌)లో 73.5 లక్షల ఉద్యోగాలు  గల్లంతయ్యాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఈఐ) తెలిపింది. దేశంలో నిరుద్యోగ రేటు మార్చిలో నమోదైన 6.5 శాతం నుంచి ఏప్రిల్‌లో 8 శాతానికి ఎగబాకిందని తాజా నివేదికలో వెల్లడించింది. రిపోర్టులోని మరిన్ని విషయాలు.. 


ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యమవుతున్న కార్మికుల వాటా (లేబర్‌ పార్టిసిపేషన్‌ రేటు-ఎల్‌పీఆర్‌) వరుసగా మూడో నెలా తగ్గింది. కొవిడ్‌ రెండో దశ ఉధృతిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు విధించిన స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా ఏప్రిల్‌లో 39.98 శాతానికి పడిపోయింది. 2020 మే తర్వాత కనిష్ఠ స్థాయిది. 


ఈ మార్చిలో 37.6 శాతంగా ఉన్న ఉద్యోగ రేటు..ఏప్రిల్‌లో 36.8 శాతానికి జారుకుంది. 


లాక్‌డౌన్‌లు, స్థానిక ఆంక్షలతో ఎల్‌పీఆర్‌ తగినప్పటికీ, ఉద్యోగాల తగ్గుదలకు దీన్ని ఆపాదించలేం. ఎందుకంటే, లాక్‌డౌన్‌లతో ప్రభావితం కాని వ్యవసాయ రంగంలోనే ఉద్యోగాలు అధికంగా తగ్గాయి. 


గత నెలలో కోల్పోయిన 73.5 లక్షల ఉద్యోగాల్లో 60 లక్షలు వ్యవసాయ రంగానికి సంబంధించినవే. ఈ రంగంలోని ఉద్యోగాలు మార్చిలో 12 కోట్లుగా నమోదు కాగా, ఏప్రిల్‌లో 11.4 కోట్లకు తగ్గాయి. సాధారణంగానే ఏప్రిల్‌ నాటికి రబీ పంట పనులు ముగుస్తాయి. కాబట్టి, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. 


గత నెలలో 2 లక్షల మంది దినసరి కూలీలు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. వేతన జీవుల్లో 34 లక్షల మంది ఉద్యోగం కోల్పోయారు. 


వేతన జీవుల ఉద్యోగాలు తగ్గడం వరుసగా ఇది మూడో నెల. ఈ మూడు నెలల్లో మొత్తం 86 లక్షల ఉద్యోగాల నష్టం జరిగింది. గత ఏడాది కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.26 కోట్ల మంది వేతన జీవులు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 


2019-20 ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశంలో వేతన జీవులు 8.59 కోట్లు కాగా.. ఏప్రిల్‌ నెల ముగిసేనాటికి సంఖ్య 7.33 కోట్లకు తగ్గింది. 2019 -20 చివరినాటికి గ్రామాల్లోని వేతన ఉద్యోగుల వాటా 42 శాతంగా, పట్టణాల్లో వాటా 58 శాతంగా ఉంది. అయితే,  ఉద్యోగం కోల్పోయిన వారిలో 68 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, పట్టణ ప్రాంతాల వారు 32 శాతంగా ఉన్నారు. కరోనా సంక్షోభంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకే అధిక నష్టం వాటిల్లిందనడానికి ఇదే సంకేతం. 


2021-22లోనూ ఉద్యోగార్ధులకు నిరాశే.. 

కరోనా మలి దశ వ్యాప్తి దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు అడ్డుకట్ట వేసింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలిగే కొత్త పెట్టుబడులు ఈ ఏడాది కూడా వాయిదా పడవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ జాబ్‌ మార్కెట్లో నిస్తేజం కొనసాగనుంది.     


- సీఎంఐఈ 

Updated Date - 2021-05-14T05:26:26+05:30 IST