2025 నాటికి రూ.11 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-03-14T06:25:35+05:30 IST

దేశీయ ఆర్థిక సేవల సాంకేతిక (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ) మార్కెట్‌ విలువ వచ్చే ఐదేళ్లలో మూడింతలు కానుందని బీసీజీ, ఫిక్కీ సంయుక్త నివేదిక అంచనా వేసింది

2025 నాటికి రూ.11 లక్షల కోట్లు

భారత ఫిన్‌ టెక్‌ ఇండస్ట్రీపై బీసీజీ-ఫిక్కీ నివేదిక అంచనా 


న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక సేవల సాంకేతిక (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ) మార్కెట్‌ విలువ వచ్చే ఐదేళ్లలో మూడింతలు కానుందని బీసీజీ, ఫిక్కీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి ఇండస్ట్రీ విలువ 15,000-16,000 కోట్ల డాలర్లకు (రూ.10,95,000-11,68,000 కోట్లు) చేరుకోవచ్చని అంటోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ సైజు 5,000-6,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని నివేదికలో పేర్కొంది. ఐదేళ్లలో మరో 10,000 కోట్ల డాలర్ల విలువను సృష్టించేందుకు భారత ఫిన్‌టెక్‌ ఇండస్ట్రీకి 2,000-2,500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని నివేదిక అంచనా వేసింది.


భారత ఫిన్‌టెక్‌ రంగంలో 2,100కు పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయి. అందులో 67 శాతం కంపెనీలు గడిచిన ఐదేళ్లలో ప్రారంభమైనవే. కరోనా సంక్షోభ కాలంలోనూ ఈ ఇండస్ట్రీ దూసుకెళ్లింది. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు మరో 3 ఫిన్‌టెక్‌ స్టార్ట్‌పలు యూనికార్న్‌లుగా అవతరించాయి. కనీసం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,300 కోట్లు) మార్కెట్‌ విలువ కలిగిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలుస్తారు. మరో ఐదు కంపెనీల విలువ 50 కోట్ల డాలర్ల స్థాయిని దాటేసింది. వచ్చే ఐదేళ్లలో భారత ఫిన్‌టెక్‌ రంగంలోని యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపునకు పైగా పెరగనుందని బీసీజీ-ఫిక్కీ నివేదిక అంచనా వేసింది. 

Updated Date - 2021-03-14T06:25:35+05:30 IST