మండలాల వారీగా నిషేధ భూముల జాబితాలు
ABN , First Publish Date - 2021-10-29T09:29:22+05:30 IST
మండలాల వారీగా నిషేధ భూముల జాబితాలు
డిసెంబరుకు సిద్ధం చేయాలని సర్కారు ఆదేశం
ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు
తేలనున్న అన్ని శాఖల భూముల లెక్కలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నిషేధ భూముల జాబితాపై సర్కారు దృష్టి సారించింది. మండలం వారీగా వాటి లెక్క తీయాలని, ఆ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనివల్ల ఏ భూమి 22-ఏలో ఉంది? దేన్ని తొలగించారో? ప్రజలకు తెలిసిపోతుందని భావించింది. అందుకే గ్రామ స్థాయిలోకి సమాచారం తీసుకెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏలో భాగంగా ప్రభుత్వ భూములతోపాటు, సర్కారు ప్రయోజనాలున్న భూములు పరాధీనం కాకుండా నిరోధించేందుకు వాటిని నిషేధ భూముల జాబితాలో చేరుస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు అధికారులు, నేతలు ఈ సెక్షన్‌ను స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విశాఖ, కర్నూలు, అనంత, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇటీవల 22-ఏ కేసులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్లతో సంబంధం లేకుండా సాగు భూములను సైతం ప్రభుత్వ ఆసక్తి ఉన్న భూములుగా చూపిస్తూ నిషేధ జాబితాలో చేరుస్తున్నారు. కేవలం తహసీల్దార్ ఇచ్చే నివేదికలతోనే రైతుల భూముల రాతలు రాత్రికిరాత్రే మారిపోతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, లేదా, అధికారుల సొంత నిర్ణయాలతో ఏదైనా భూమిని నిషేధ జాబితాలో చేర్చడం చాలా సులువు. ఒక్క సంతకంతోనే ఆ పనవుతుంది. కానీ, అదే భూమిని పొరపాటుగా 22-లో చేర్చారంటే, దానికి విముక్తి కల్పించడానికి అనేక నిబంధనలు పాటించాలి. ఈ విషయంపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి నూతన విధానం రూపొందించాలని ఇటీవల రీ సర్వేపై సమీక్షలో సీఎం జగన్ రెవెన్యూశాఖను ఆదేశించారు. దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తొలుత, మండలం వారీగా ఇప్పుడున్న నిషేధ భూముల జాబితాను రూపొందించాలని నిర్ణయించారు. ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్‌లోని భూమి 22-ఏలో ఉందో ఈ జాబితాలో తెలిసిపోతుంది. అవసరమైతే గ్రామ సచివాలయంలో ఈ జాబితా అందుబాటులో ఉంచాలని సర్కారు భావిస్తోంది. ఇదిలాఉంటే, ప్రభుత్వ శాఖల భూములను కూడా 22-ఏలో చేర్చారు. వాటి ని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిరోధించేందుకు నిషేధ జాబితాలో ఉంచారు. ఇప్పుడు ఆయా శాఖల భూముల లెక్కలు కూడా తీయాలని సీఎం ఆదేశించారు. శాఖల వారీగా నిషేధ భూముల జాబితాను లెక్కతీస్తే మొత్తం భూమి ఉందా? ఏమైనా పరాధీనమైందా? అన్న విషయం తేలుతుందని, దీని ఆధారంగా ఆ తదుపరి చర్యలు తీసుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు నెలాఖరు నాటికి అన్ని జాబితాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలు వెళ్లాయి.