సినిమా టికెట్ల వ్యవహారంపై YSRCP ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-12-30T12:27:38+05:30 IST
సినిమా టికెట్ల వ్యవహారంపై YSRCP ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

- ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు నడుమ ఎలాంటి గ్యాప్ లేదు..
తిరుమల : ప్రభుత్వానికి, సినీపరిశ్రమకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఎమ్యెల్యే, సినీ నటి రోజా అన్నారు. బుధవారం నాడు కుమారుడితో కలసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. అన్ని సినిమాలకూ టికెట్ల ధరలు ఒకేరకంగా వుంటే పేద, మధ్యతరగతి వాళ్లందరూ సినిమా చూసే అవకాశముంటుందన్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలే టికెట్ రేట్లపై అభ్యంతరం చెబుతున్నారన్నారని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు ఎన్ని అబద్ధాలు అడినా జగన్‌కు ఏమీకాదన్నారు.
సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం..
అనంతరం మరో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ .. ఆస్పత్రులను అభివృద్ధి చేసి వైద్య సదుపాయాలు పెంచి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందు బాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాడు-నేడు పథకం ద్వారా వడమాలపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.45 లక్షలతో ఆధునికీకరించగా దానిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రోజా చారిటబుల్ ట్రస్ట్ తరుపున రూ.లక్ష రూపాయలు విలువైన మందులు, రూ. లక్షన్నర విలువైన అత్యాధునికి మంచాలు, బెడ్స్, హాస్పిటల్ ఉపకరణాలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవిరాజు, ఎంపీడీఓ మల్లికార్జున, తహ సీల్థారు భార్గవి, డాక్టర్ చక్రపాణి, పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీ, సర్పంచులు మంజుల బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.